శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:10 IST)

ఏపీలో సంచలనం : డీజీపీ గౌతం సవాంగ్‌పై వేటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్‌గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ఈయన ఇంటెలిజెన్స్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలను ప్రస్తుతం ఈయన వద్దే ఉంచారు. 
 
మరోవైపు, గౌతమ్ సవాంగ్‌ను సాధారణ పరిపలనా శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, గతంలో విజయవాడ, విశాఖపట్టణం పోలీస్ కమిషనర్‌గా పని చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా కూడా విధులు నిర్వహించారు. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ఉన్నప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డిని పోలీస్ బాస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. 
 
రాజేంద్రనాథ్ రెడ్డి 1992 ఐపీఎస్ కేడర్‌కు చెందిన వ్యక్తి. మరోవైపు, గౌతం సవాంగ్‌కు ఏపీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వక పోవడం గమనార్హం. అదేసమయంలో తనకు డీజీపీ పోస్టు ఇవ్వకుండా జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డికి పోస్టింగ్ ఇవ్వడం పట్ల ద్వారకా తిరుమలరావు కినుకు వహించినట్టు సమాచారం.