బుధవారం, 8 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (09:40 IST)

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని...

deadbody
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఓ విషాదక ఘటన చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళుతున్న ఓ విద్యార్థిని గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి (18) నందిగామలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూలాగే సోమవారం కూడా కళాశాలకు హాజరైంది. సాయంత్రం 4.30 గంటల సమయంలో తరగతులు ముగిశాక, తన స్నేహితురాలితో కలిసి సీఎం రోడ్డు మీదుగా నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలోనే ఆమె అకస్మాత్తుగా కింద పడిపోయింది.
 
దీంతో ఆందోళనకు గురైన స్నేహితురాలు, స్థానికులు వెంటనే స్పందించి నాగమణిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి మరణానికి గుండెపోటు కారణమని తెలిపారు. ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 
నాగమణికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉండేదని స్నేహితులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం ఉదయం కాలేజీకి వచ్చే ముందు తనకు గ్యాస్ సమస్యగా ఉందని చెప్పి ఓ మాత్ర వేసుకుందని, సాయంత్రం వరకు అందరితో ఎంతో చలాకీగా మాట్లాడిందని వారు తెలిపారు. అంతలోనే ఇలా జరగడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉన్నత భవిష్యత్తు ఉన్న యువతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.