అహల్య అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంది, ఆన్లైన్ షాపింగ్ దెబ్బ
గాజువాకలో ఘోరం చోటుచేసుకుంది. ఆన్ లైన్ అప్పులు తీర్చలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈమధ్య కాలంలో ఆన్లైన్ వేదికగా అనేక ఆకర్షణీయ పద్ధతుల్లో వినియోగదారులను ఆకర్షిస్తున్న క్రమంలో ఈమె కూడా ఆ మాయలో పడిపోయి ఇబ్బడిముబ్బడిగా వస్తువులు కొనేసింది.
వివరాల్లోకి వెళితే.. గాజువాకలో ఆటోనగర్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది 25 ఏళ్ల అహల్య. లాక్ డౌన్ కావడంతో ఇంట్లో వుంటోంది. ఈ క్రమంలో ఇంటికి అవసరమైన వస్తువులు సుమారుగా రూ. 40 వేల విలువైనవి కొనుగోలు చేసింది. ఐతే ఆన్లైన్ ద్వారా కొన్న వస్తువుల తాలూకు డబ్బును నిన్న రాత్రి లోపుగా కట్టాలని అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేసారు.
డబ్బు ఇస్తానని చెప్పింది కానీ సకాలంలో డబ్బు అందక పోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీనితో స్నానం చేసి వస్తానని చెప్పి గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. బ్యాంకు పనిపై వెళ్లిన ఆమె తల్లి ఇంటికి ఫోన్ చేస్తే ఎంతకీ స్పందించలేదు. దీనితో హుటాహుటిని ఇంటికి వచ్చిన ఆమె తల్లి గది తలుపు కొట్టినా ఎంతకీ తీయలేదు. ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని ఫ్యానుకు వేలాడుతూ వుంది. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.