బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మతోన్మాదిని అయిపోతానా? పవన్ ప్రశ్న
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నంతమాత్రాన తాను మతోన్మాదిని అయిపోతానా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన తానేమీ మతోన్మాదిని అయిపోనని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సమస్యలు వస్తే అవి పార్టీ పరిధిలోనే మాట్లాడుకుందామన్నారు. బీజేపీ నిజంగానే మతోన్మాదులు ఉన్న పార్టీ అయితే దేశంలో ఇంత భద్రత ఉండదన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ సెక్యులర్ పార్టీలేనని, వారి వైఖరి మాత్రమే వేరుగా ఉంటుందని అన్నారు.
బీజేపీ సెక్యులర్ పార్టీ కానప్పుడు వైసీపీ సెక్యులర్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు చేసేది ఒకటి, చెప్పేది ఇంకోటి అని, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు ఆ పార్టీ ఓటేస్తుందని, ఇక్కడికొచ్చి దానికి వ్యతిరేకమని చెబుతోందని విమర్శించారు.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది సరైన చర్య కాదన్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. పవన్ ఓ ప్రకటన చేశారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. శాసన సభలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. దానిపై పెద్దల సభలో మేధోపరమైన చర్చచేయాలన్న ఉన్నతాశయంతో శాసన మండలి ఏర్పాటైందని అన్నారు.
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేయడం సబబు కాదన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయామన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు నిలిచిపోతే ఏకంగా మండలినే రద్దు చేయడం సహేతుకంగా లేదన్నారు. మండలి రద్దుకు ప్రజామోదాన్ని పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.