బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:00 IST)

పంచాయతీ గెలవలేని లోకేష్‌కి పంచాయతీ రాజ్ మంత్రి పదవా?... పవన్ కల్యాణ్

జనసేన కవాతులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.... ముఖ్యమంత్రిగానీ, ప్రధానిగానీ యువతకు ఎంతో చెప్పారు. సీఎం అయితే.. రెండుకోట్ల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని చెప్పారు. ఆ ఉద్యోగాలు రాలేదు. జిల్లాకు యాభైవేల ఉద్యోగాలు వచ్చేస్తాయన్నారు. కనీసం 500 ఉద్యోగాలు కూడా రాలేదు. ఇవన్నీ యువతను క్షోభకు గురిచేస్తున్నాయ్. చాలామందిలో ఆవేదన కొన్ని దశాబ్దాలుగా రగిలి రగిలి, ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణమైంది.


జనసేన పార్టీ చాలా బాధ్యతతో, చాలా క్రమశిక్షణతో నడిచే పార్టీ. నా సంస్కారాలను గురించి చాలామంది రాజకీయ నాయకులు చెబుతుంటారు. మీరు ఉండేదెప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు కదా అంటుంటారు. అవును నిజం. నేను ప్రజల పక్షానే ఉంటాను. నాయకుడే ఆదర్శంగా ఉండాలని నేను అనుకుంటాను. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని సామెత. అలాగే నాయకులను బట్టే పాలన ఉంటుంది. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యం అవహేళనకు గురవుతోంది. 
 
అధికార పక్షం నాయకులు, ప్రతిపక్షం ఎమ్మెల్యేలను జంతువుల్లాగా కొంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు. ఈ రోజున, తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ జనసేన పట్ల కనిపిస్తున్న ఈ ప్రేమ 2009లో మనకు లేదా? ఉంది. అయినా సరే.. అప్పుడే మనం ఎందుకు పోటీచేయలేదంటే.. ఒక సుశిక్షితుడిగా రంగంలోకి రావాలనుకున్నాం. ఒక పోలీసు కానిస్టేబుల్ కావాలన్నా.. శిక్షణ కావాలి. ఒక గెజిటెడ్ ఆఫీసర్ కావాలంటే.. ఎగ్జామ్ రాయాలి. నాయకుడు కావాలంటే అనుభవం కావాలి. ఇన్నికోట్ల మంది ప్రజల జీవితాన్ని శాసించే ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి అనుభవం ఉండాలని కోరుకున్నా. అందుకే 2009లో కూడా పోటీచేయడానికి ముందుకు రాలేదు. 2014లో కూడా నేను స్వయంగా పూనుకోలేదు. అనుభవంతో ఉండే నాయకుడు ఒకడున్నాడు.. పెద్దవాడు.. వందల కిలోమీటర్లు నడిచారు.. సమస్యలన్నీ చూశారు.. అన్నిటినీ పరిష్కరించేస్తారు.. అంటే నమ్మాను. ఆయనకు మద్దతుగా ఆ రోజున నిలబడ్డాను.
 
నేను పార్టీ పెట్టింది. స్వప్రయోజనాల కోసం కాదు.. దేశం కోసం, సమాజం కోసం పెట్టాను. 2014లో ఈ బలం మనకి లేదా? ఉంది. కానీ, ఓట్లు చీల్చి రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక బాధ్యతతో రాష్ట్ర శ్రేయస్సు కోసం దేశభక్తితో నేను పోటీచేయకుండా.. అనుభవజ్ఞులైన వ్యక్తి అని నారా చంద్రబాబును మద్దతిచ్చాను. 
 
ఏడాదికి కోట్లకు కోట్ల రూపాయల సంపాదన ఉండే సినిమా రంగాన్ని వదలుకుని కేవలం రాష్ట్రం కోసం, సమాజ శ్రేయస్సుకోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటిదాకా సినిమాలు నా సర్వస్వం. నాకింకో మార్గం లేదు. ఆస్తి లేదు. హెరిటేజ్ లాగా వేలకోట్ల ఫ్యాక్టరీల్లేవు. వందల కోట్ల ఆస్తుల్లేవు. కానీ దేశం మీద ప్రేమ, ఆడపడచులు బాగుండాలనే కోరికతో ఏమీ ఆశించకుండా.. రాష్ట్రానికి సుపరిపాలనకోసం ముఖ్యమంత్రిని కోరుకుంటే.. చంద్రబాబునాయుడు మనకిచ్చింది.. ఏంటి? ఆవేదన మిగిల్చారు. 
 
చంద్రబాబు నాయుడు తనను అధికారంలోకి తీసుకు వచ్చిన జనసేనను తొక్కేయాలని చూశారు. అమరావతిలో.. ఇవాళ మనం పార్టీ కార్యాలయం స్థాపించాం అంటే.. చాలామంది నా భావజాలాన్ని ఇష్టపడి, అన్ని కులాల నుంచి వచ్చి సహకరించడం వల్లనే సాధ్యమైంది. అంతే తప్ప తెదేపా సహకారంతో అది సాధ్యం కాలేదు. 
 
చంద్రబాబునాయుడు, ఆయన ఇంటికి మనం వెళ్తే టీ ఇస్తారు, మర్యాద ఇస్తారుగానీ.. జనసేనను మాత్రం  తొక్కేయాలని చూశారు. జనసేన..  టీడీపీకి పరాధీన వస్తువులా ఉండాలని చంద్రబాబు కోరుకున్నారు. నేను ఆ పార్టీని మోయడం కోసం పార్టీ పెట్టలా? 2014లో ఓట్లు  చీలకూడదని కోరుకున్నాను కాబట్టే వారికి మద్దతిచ్చాను. అంత చేస్తే.. పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ నన్ను ఏ సలహా అడగలేదు. ప్రత్యేక హోదా గురించి ఏం చేద్దామో కూడా మాట్లాడలేదు. ఆయనకు పవన్ కల్యాణ్, జనసైనికులు ఓట్ల కోసం మాత్రం కావాలి. అంతే తప్ప.. ప్రజాసంక్షేమం విషయంలో వారి ఆలోచనలు మాత్రం అక్కర్లేదు. 
 
2018 మార్చిలో నేను ప్రభుత్వంలో ఉన్న అవినీతి గురించి మాట్లాడితే.. సడెన్‌గా ఎందుకు మాట్లాడుతావ్ అన్నారు. అప్పటికే ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. మరి ఆయనకు ఇంత అనుభవం ఆయన చెప్పినవి ఏమీ జరగలేదు. అనుభవం పనిచేస్తే.. జరిగి ఉండాలి కదా. ఒకప్పుడు గోదావరి అంటే ఎటుచూసినా అందాలుండేవి, ఇవాళ ఏ మూల చూసినా ఇసుక దోపిడీలు, గూండాల పాలన తయారయ్యాయి. జన్మభూమి కమిటీల ముసుగులో గూండా కమిటీలను, దోపిడీ కమిటీలను నిర్వహిస్తున్నారు. 
 
నేను ప్రభుత్వానికి ఇంత అండగా ఉంటే... నన్ను బూతులు తిట్టించారు. నా తల్లిని తిట్టించారు. జనసేన ఎదగకూడదు అని చంద్రబాబునాయుడు కోరుకున్నారు. అందుకే, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ఇద్దరికీ చెబుతున్నా...  ఏం మాట్లాడినా పవన్ కల్యాణ్ సినిమా యాక్టర్ అంటారు. ఏం తెలీదు అంటారు. మీ కొడుకు లోకేష్‌కు ఏం తెలుసు? కనీసం ధైర్యముంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయమని చెప్పండి.. అతన్ని పంచాయతీ రాజ్ మంత్రిని చేస్తారా? అని ప్రశ్నిస్తున్నా. రాజ్యాంగం గురించి, వ్యవస్థ గురించి ఆయన చెబుతారు. మీ అబ్బాయికేం తెలుసునని ఆయనను మీరు దొడ్డిదారిలో మంత్రిని చేశారో చెప్పాలి. 
 
ఎక్కడైనా సరే.. వారసత్వం కొడుక్కి రావాలి అంటుంటారు. వారసత్వం అంటే ఏంటి.. రూపురేఖలు, ఇంటిపేరు, ఆస్తులు వస్తాయి. అనుభవం వారసత్వంగా వస్తుందా? ఈ రకంగా మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయడానికా జనసేన మీకు కాపుగాసింది. రెండు కోట్ల ఉద్యోగాలు అని మాట చెప్పేశారు. పట్టించుకోలేదు. ఇచ్ఛాపురంలో ఓ పెద్దాయనతో మాట్లాడుతోంటే ఈ ప్రస్తావన వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న ఆయనను అడిగా.. బాబు వస్తే జాబు వస్తుందన్నారు గదా.. ఏమైంది అని అడిగా. దానికాయన ‘‘జీలకర్రలో కర్ర లేదు.. నేతిబీరలో నెయ్యిలేదు.. బాబు జాబులో.. జాబు లేదని’’ చెప్పారు.. అదీ పరిస్థితి.