బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:39 IST)

ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఎందుకు దాస్తున్నారు? సాకే శైలజనాథ్

జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో చెలగాటం ఆడకుండా తక్షణమే వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను జగన్ రెడ్డి ప్రభుత్వం రోడ్లపై ఆందోళనలు చేయాల్సిన దుస్థితికి తీసుకు వచ్చిందని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, మాయమాటలతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. 
 
 
13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను జగన్ రెడ్డి ప్రభుత్వం వీధిన పడేలా చేస్తోందని ఆరోపించారు. అప్పులు చేసి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన జగన్ రెడ్డి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవడం దారుణమన్నారు. కరోనా సమయంలో సుమారు 4 నుండి 5వేల మంది ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించడం లేదని, చట్టబద్ధంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. 
 
 
ప‌ద‌కొండో పీఆర్సీ అమలు, సీసీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి ప్రభుత్వం పంతానికి పోకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని శైలజనాథ్ విమర్శించారు. ఆర్థిక మంత్రి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలతో ఏ రోజైనా ఆర్థికమంత్రి చర్చించారా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు.
  
 
పి.ఆర్.సి కమిషన్ నివేదిక ఇచ్చి చాలాకాలం అయినందున ఈ సంవత్సరం 11వ పిఆర్సిని ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన రీతిగా సి.పి.ఎస్ ను రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 01-07-2018 నుండి పెండింగ్ లో ఉన్న డి.ఏ లలో రెండు డి.ఏలు అనగా 01-07-2018,  01-01-2019 డి.ఏ లను,  01-07-2018 నుండి 01-07-2021 వరకు ఇవ్వవలసిన మిగిలిన ఐదు డి.ఏ లను  31-12-2021 లోగా ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు.  గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోపాభుయీష్టమైన సి.ఎఫ్.ఎం.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, జిల్లా సెలెక్ట్ కమిటీల ద్వారా ఆర్ ఓ ఆర్ ప్రకారం ఎంపిక కాబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, అలాగే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. 
 
 
సీపీఎస్ ఉద్యోగులకు 90శాతం నగదు చెల్లింపులు చేసి, 10 శాతం వారి ప్రాన్ ఖాతాలో జమ చేయాలని, ఎరియర్స్ చెల్లింపులు ఇప్పటి వరకు ఏవీ జరగలేదన్నారు. చెల్లింపులు పూర్తిగా జరగకుండానే పేపర్ల మీద మాత్రం చూపి డీఏలు ఇచ్చామనడం ఎంతవరకు సబబని అన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏల సంఖ్య 7కు చేరిందని పేర్కొన్నారు. ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మద్దతూ ఎప్పుడూ ఉంటుందని శైలజనాథ్ స్పష్టం చేశారు.