గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 30 మార్చి 2020 (23:11 IST)

తిరుమల శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారాలు నమ్మకండి, పెద్దజియ్యర్ స్వామి

తిరుమల శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆగిపోయింది.. సరిగ్గా నైవేద్యాలు పెట్టడం లేదు. ఆలయంలో ఎన్నో రకాల అపచారాలు జరుగుతున్నాయని రకరకాల ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు కావాలనే పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరూ ఆందోళనకు గురికావద్దు.
 
ఆలయంలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి వరకు ఏకాంత సేవలన్నీ సరిగ్గానే నిర్వహిస్తున్నాము. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేవు. అఖండ దీపాన్ని కూడా చిన్నదిగా చేశాము కానీ.. దీపం 24 గంటల పాటు వెలుగుతోంది. కైంకర్యాలన్నీ సక్రమంగా కొనసాగుతున్నాయి అంటూ తిరుమల పెద్దజియ్యంగార్ స్పష్టం చేశారు. 
 
స్వయంగా పెద్దజియ్యంగార్ టిటిడి ఈఓకు ఒక లేఖ కూడా రాశారు. ఆలయంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని..ప్రజా సంబంధాల అధికారి ద్వారా మీడియా ప్రకటన చేయాలని కూడా నిన్ననే పెద్దజియ్యంగార్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న హడావిడిగా పిఆర్ ఓ విభాగం మీడియాకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మీడియా ముందు ఎప్పుడూ రాని పెద్దజియ్యంగార్ ఈరోజు మధ్యాహ్నం తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి తిరుమలపై  జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు.