తిరుమలలో ముగిసిన యాగం, శ్రీవారి దయతో కరోనా వైరస్ అంతమొందుతుందా?
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టిటిడి తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి ఈవో కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు చేపడుతున్న చర్యలను తెలియజేశారు.
బర్డ్ ఆసుపత్రి కేటాయింపు
రాయలసీమ జిల్లాల నుండి కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వస్తున్నాయని, అవసరమైతే బర్డ్ ఆసుపత్రిని కూడా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు, క్వారంటైన్‌గా వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఈవో వెల్లడించారు. ఇందుకోసం టిటిడి అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతిలోని రుయా ఆసుపత్రితోపాటు స్విమ్స్, పద్మావతి వైద్య కళాశాలలో కరోనా వ్యాధి అనుమానితుల కోసం తగిన ఏర్పాట్లు చేశారని, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వసతి సముదాయాన్ని క్వారంటైన్ కేంద్రంగా వినియోగిస్తున్నారని తెలియజేశారు.
వెంటిలేటర్లు కొనుగోలుకు సాయం
ప్రస్తుత పరిస్థితుల్లో వెంటిలేటర్ల కొరత ఉందని తెలుస్తోందని, స్విమ్స్‌లో ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్లు, ఇంకా ఎన్ని అవసరమవుతాయి అనే అంశంపై జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం సమీక్షించారని, అవసరమైన వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని ఈవో తెలిపారు.
టిటిడిలో అత్యవసర విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు
టిటిడిలో భద్రత, ఆరోగ్య, వైద్య, శ్రీవారి ఆలయం, వసతికల్పన విభాగం తదితర అత్యవసర విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని వీరిందరికీ ఈవో ధన్యవాదాలు తెలియజేశారు.