గోవిందా, అభాగ్యులను ఆదుకుంటున్న తిరుమల వేంకటేశ్వరుడు, ఎలా?
కరోనా కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా కొంతమంది ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, టిటిడి బోర్డు ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సూచనల మేరకు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా మార్చి 28వ తేదీ నుండి తిరుపతిలో ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించారు. అవసరమైతే ఒక పూటకు 50 వేల ఆహార పొట్లాలు తయారుచేసి పంపిణీ చేసేందుకు టిటిడి సిద్ధమైంది.
టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుపతి జెఈవో పి. బసంత్ కుమార్ పర్యవేక్షణలో తొలిరోజు శనివారం 25 వేల పులిహోర పొట్లాలను టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సిద్ధం చేశారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వద్దగల క్యాంటీన్‌లో ఈ మేరకు ఆహారపొట్లాలను రెవెన్యూ, తుడ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అందజేశారు. పొంగళ్, పెరుగన్నం, టమోటా రైస్, బిసిబెళా బాత్, కిచిడీ తదితరాలతో కూడిన మెనును రోజుకొకటి చొప్పున తయారుచేస్తారు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 30 వేల పొట్లాలు, రాత్రి 20 వేల పొట్లాలను తయారు చేసేందుకు టిటిడి అధికారులు ప్రణాళిక రూపొందించారు. రెవెన్యూ, తుడ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ సిబ్బంది సాయంతో తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో సత్రం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వద్ద ఆహార పొట్లాలను అవసరమైన వారికి అందిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు శ్రీవారి నిధులతో వీటిని పంపిణీ చేయనుంది టిటిడి.