శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (07:04 IST)

విద్యుత్తు వినియోగ చార్జీల బకాయిలు సకాలంలో చెల్లించాలి: సీఎస్ ఆదేశం

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన విద్యుత్తు వినియోగ చార్జీల బకాయిలను ఎపి ట్రాన్స్‌కోకు సకాలంలో చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో విద్యుత్ వినియోగ చార్జీలు బకాయిలు అంశంపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు.

వివిధ శాఖలు చెల్లించాల్సిన విద్యుత్ వినియోగ చార్జీలు చెల్లించేందుకు అందుబాటులో ఉన్న నిధులను బట్టి సకాలంలో చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మరియు నీటిపారుదలశాఖల నుండి అధిక మొత్తంలో విద్యుత్ వినియోగపు చార్జీల బకాయిలు ట్రాన్సుకోకు చెల్లించాల్సి ఉందని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శీక్రాంత్ సిఎస్ దృష్టికి తెచ్చారు.

కేంద్రం నుండి ఆర్ధిక సంఘం నిధులు గ్రామ పంచాయితీలకు రాగానే సకాలంలో ఎపి ట్రాన్సుకోకు చెల్లించాలని సిఎస్  ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలో వివిధ మౌళిక సదుపాయాల కల్పనకు రానున్న ఐదేళ్ళలో కేంద్రం నుండి మంజూరు కానున్న లక్షలాది కోట్ల రూ.లు ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై సిఎస్ నీలం సాహ్నివివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించారు.

ఇందుకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి రెండు మూడు రోజుల్లోగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి అందించాలని చెప్పారు. తాగునీటి ప్రాజెక్టులు, విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులు, అమరావతి రాజధాని ప్రాంతంలో బాహ్యవలయ, అంతర్ వలయ రహదార్లు, రాజధాని నిర్మాణ ప్రాజెక్టులు, భూగర్భ డ్రైనేజి విధానం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు.

అలాగే పట్టణ గృహనిర్మాణం, సాలిడ్ వేస్ట్ నిర్వహణ ప్రాజెక్టులు, విద్యా, వైద్య, పర్యాటక, క్రీడా పరమైన ప్రాజెక్టులకు సంబంధించిన మౌళిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని చెప్పారు. అంతేగాక ఓడరేవులు, విమానాశ్రయాలు, ప్రత్యేక ఆర్ధిక మండళ్లు, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్, రోడ్లు,రైలు మార్గాలు, వంతెనలు, అర్బన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, ఐటి తదితర అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని సిఎస్ నీలం సాహ్ని ఆయా కార్యదర్శులను ఆదేశించారు.

సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్ ప్రసాద్, సతీష్ చంద్ర, కరికల వల్లవన్, పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.