సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (14:19 IST)

ఐరాసకి బకాయిలు మొత్తం చెల్లించాం... భారత్

ఐక్య రాజ్య సమితి (ఐరాస)కి బకాయిలు మొత్తం చెల్లించిన 35 దేశాల్లో భారత్ కూడా ఉన్నట్టు ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ వెల్లడించారు.
 
ఖజానా ఖాళీ కావడంతో ఐరాస తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘బకాయిలన్నీ కట్టేశాం. మొత్తం 193 దేశాలకు గానూ 35 దేశాలు మాత్రమే ఐరాసకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాయి...’’ అని పేర్కొన్నారు. 
 
భారత్‌తో పాటు ఐరాసకు చెల్లింపులు జరిపిన దేశాల జాబితాను సైతం ఆయన ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఐస్‌లాండ్, నార్వే, జర్మనీ, ఇటలీ, సింగపూర్, స్విట్జర్లాండ్ తదితర దేశాలు ఉన్నాయి. కాగా బకాయిలు చెల్లించని దేశాల పేర్లు ఐరాస వెల్లడించే అవకాశం లేదని చెబుతున్నారు. 
 
అయితే అమెరికా, బ్రెజిల్, అర్జెంటైనా, మెక్సికో, ఇరాన్ తదితర దేశాలు వీటిలో ఉన్నట్టు సమాచారం. దాదాపు 64 దేశాలు ఐరాసకు బాకీ ఉన్నాయి. కాగా చాలా సభ్య దేశాలు చెల్లింపులు జరపక పోవడంతో ఐరాస తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.