బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (18:19 IST)

ప్రజా సంకల్ప విజయానికి నాలుగేళ్లు పూర్తి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

జనం గుండె చప్పుడు వింటూ, దగాపడ్డ రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్షనేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రజా సంకల్ప అడుగులు నేటికీ కళ్ల ముందు మెదులుతునే ఉన్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జననేత వైఎస్ జ‌న్మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నియోజకవర్గంలో పాదయాత్రలకు ఆయన పిలుపునిచ్చారు. 

 
నాటి పాదయాత్ర జ‌గ‌న‌న్న ప‌రిపాల‌న‌ను మరోసారి ప్రజలకు గుర్తు చేసేలా అన్ని డివిజన్లలోనూ ఈ కార్యక్రమాలు కొనసాగించాలని వివరించారు. తెలుగుదేశం కబంధ హస్తాల నుంచి తిరుగులేని మెజార్టీతో రాష్ట్రాన్ని రక్షించి, అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల కాలంలోనే 97 శాతం హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. 2017 నవంబర్ 6న తన ప్రజా సంకల్పయాత్రను ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారకం నుంచి ప్రారంభించి, 2019 జనవరి 9 నాటికి ఇచ్చాపురం చేరుకుని చరిత్ర సృష్టించారన్నారు. సుధీర్ఘ పాదయాత్రలో నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలను తెలుసుకుని, వారికి తానున్నానన్న భరోసాను కల్పించారన్నారు. 

 
14 నెలల కాలంలో పదమూడు జిల్లాలను చుట్టేసి అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి కష్టాలు తెలుసుకుని కన్నీరు తుడిచారన్నారు. సుమారు మూడు కోట్ల మందిని ప్రత్యక్షంగా కలిసి వారి సాదకబాధకాలను విన్న జగన్మోహన్ రెడ్డి నాడు గుంటూరు సభలో నవరత్నాలను ప్రకటించారన్నారు. ఆ నవరత్నాల హారమే నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి భగవద్గీతగా మారిందని గుర్తు చేశారు. 3,648 కిలోమీటర్ల దూరం సాగిన ఆ మహాపాదయాత్రలో తానూ ఒక భాగం అయినందుకు గర్విస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేశారు.