1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎంజీ
Last Modified: ఆదివారం, 31 అక్టోబరు 2021 (19:44 IST)

YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్ర 12వ రోజు విశేషాలు ఏంటంటే?

12వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర YSR తెలంగాణ పార్టీ అధినేత్ర వైయస్ షర్మిల గారి ఆద్వర్యంలో ఆదివారం విజయవంతంగా కొనసాగింది. లంబాడీ కళానృత్యాలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మొండిగోర్వెల్లి గ్రామం నుంచి ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది. అక్కడి నుంచి నల్లవెల్లి తండా, చింతపట్ల, నల్లవెల్లి క్రాస్ మీదుగా సాగింది.

 
బోనగిరి పార్లమంట్ స్థానం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముగించుకుని నల్లగొండ పార్లమెంట్ స్థానం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్ టౌన్ వరకు పాదయాత్ర సాగింది. సాయంత్రం 6.00 గంటలకు మాల్ టౌన్ లో ఈరోజుకి పాదయాత్ర ముగిసింది.


మాల్ టౌన్ సెంటర్ లో YSR తెలంగాణ పార్టీ అధినేత్ర వైయస్ షర్మిల గారు బహిరంగ సభ నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను వైయస్ షర్మిల గారు తెలుసుకుంటూ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ముందుకు సాగారు. నల్గొండ జిల్లాలోని మాల్ టౌన్ లో పలువురు కాంగ్రెస్ నాయకులు YSR తెలంగాణ పార్టీలో చేరారు. ఈ రోజు 12.6 కిలోమీటర్లు ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది.

 
ప్రజల సమస్యలు వారి మాటల్లోనే...
అమ్మ మాది చింతపట్ల గ్రామం. మా ఊరికి ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. విద్యార్థులు చదువుకునేందుకు వెళ్లాలన్నా పుస్తకాలు బుజాన వేసుకుని పక్క ఊరికి వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. బస్సు కోసం పక్క ఊరికి నడిచి...నడిచి... ఇప్పడు నడవలేక పోతున్నాం. ఇప్పుడు కొంత దూరం నడవగానే ఆయాసం వస్తోంది. తుమ్మలం గూడకు వెళ్లి బస్సు ఎక్కుతున్నాం. ఎన్నికల ముందు వచ్చిన నాయకులు బస్సు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకూ అది అమలుకు నోచుకోలేదు. మా ఊరికి ఎలాగైనా బస్సు వచ్చేలా చూడండమ్మా..(చిట్ట సుగునమ్మ)

 
మాది మంతనగౌరి గ్రామం. మాకు తాతల నుంచి వస్తున్న భూమి ఉందమ్మా. ప్రభుత్వం అప్పట్లో 3 ఎకరాల భూమిని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్త పాస్ పుస్తకాలు తీసుకోమని అధికారులు చెప్పారు. పాస్ పుస్తకం కోసం అప్లై చేసినా అధికారులు స్పందించడం లేదు. మీరే ఎలాగైనా మా భూమి మాకు దక్కేలా చూడాలమ్మా...(మెగావత్ హతీరామ్(55)

 
మా ఊరి రైతులకు రైతు భీమా రావడం లేదమ్మా. మా గ్రామంలో రైతులు కూరగాయలు, వరి ఎక్కువగా పండిస్తారు. నీరు బాగానే ఉన్నా పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వరి పంట కూడా తీసుకోమని చెబుతున్నారు. మేము ఎక్కడికి పోవాలమ్మా. పంట కొనుగోలు చేయకుంటే నీళ్లు వచ్చి ఎందుకు..? మా ఊరి వికలాంగులకు పింఛన్ కూడా రావడం లేదు. (కాలే సక్కమ్మ) చింతపట్ల గ్రామం...

 
కొత్తపల్లిలో కిసాన్ అగ్రిగోల్డ్ ఫ్యాక్టరీ పేరుతో ఒక ఫ్యాక్టరీ వచ్చింది. అక్కడ జంతువుల బొక్కలను చురాగా చేసి నూనె తీస్తున్నారు. ఈ ఫ్యాక్టరీని హైదరాబాద్ నుంచి యజమానులు నడుపుతున్నారని మాకు సమాచారం ఉంది. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వాసనకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం పడితే మరీ ఎక్కువ దుర్వాసన వస్తోంది. అటుగా ఏ వాహనం పోయినా ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ఉంది. ఆ దుర్వాసన భరించలేక పోతున్నామమ్మా. చింత గాని గుట్ట వద్ద డ్రమ్ముల్లో ఆ బొక్కల నుంచి వచ్చిన నూనెను నింపుతున్నారు. ఈ వాసన పీల్చుకుని చుట్టు పక్కల ఊర్లలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్య గురించి ఎంతలా చెప్పినా అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరు ఆ ఫ్యాక్టరీని మూయించేలా చూడండమ్మా. (పలువురు ప్రజా నాయకులు)

 
మాది తుమ్మలం గూడెం. మా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేదు. కూరగాయలు, వరి ఎక్కువగా పండిస్తున్నాం. పంట బాగానే వచ్చినా సరైన ధరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరే ఎలాగైనా మాకు న్యాయం జరిగేలా చూడాలమ్మా.( పలువురు రైతులు)

 
మా గ్రామంలో రైతులు పండించిన పంట కొనుగోళ్లు చేసే ఐకేపీ సెంటర్లు ఇప్పటి వరకూ రాలేదు. ఐకేపీ సెంటర్లు మా ఊరికి రావాలని గత కొన్నేండ్లుగా ప్రభుత్వ అధికారులకు, నాయకులకు విన్పపించుకున్నాం. అయినా ఏ పాలకుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వరి కూడా వేయవద్దంటున్నారు. కలుపు కూలీ రూ.700 ఒకరికి పడుతోంది. పండించిన పంట అప్పు కట్టేందుకే సరిపోతోంది. రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. (మాల్ టౌన్, గ్రామం శ్రీను)

 
అమ్మా మా ఊరు మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి  జిల్లాలు కలిసి ఉంటుంది. మూడు జిల్లాలకు మాల్ టౌన్ గ్రామం మద్యలో ఉంటుంది. మా గ్రామానికి మండల స్థాయిలో అభివృద్ధి ఉన్నా మండలంగా ప్రకటించాలేదు. మండలంగా ప్రకటించాలని పాలకులకు, ప్రభుత్వ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. మా గ్రామాన్ని మండలంగా ప్రకటించాలమ్మా.( మాల్ టౌన్ గ్రామం, జంగయ్య).