సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 అక్టోబరు 2021 (18:28 IST)

వాటికన్ సిటీలో ప్రధాని మోదీ- పోప్ ఆత్మీయ ఆలింగనం, ఆ తర్వాత...

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం వాటికన్ సిటీకి చేరుకున్నారు. క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు.


భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. దాదాపు 20 నిమిషాలపాటు సమావేశం జరగాల్సి ఉండగా గంటపాటు సాగింది. స్థానిక కాలమానం ప్రకారం దాదాపు 8.30 గంటలకు వాటికన్ ప్రాంగణానికి చేరుకున్నారు మోదీ. అక్కడి సీనియర్ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

 
మోడీ వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. పోప్‌ను ప్రధాని మోదీ కలిసినప్పుడు, పోప్ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో గాఢమైన సాన్నిహిత్యం, పరస్పర గౌరవం, ప్రేమ తొణికిసలాడింది.

 
తొలుత పోప్‌ను ఏకాంతంగా కలిసిన మోదీ, ఆ తర్వాత ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సాంప్రదాయకంగా, పోప్‌తో సమావేశానికి ముందుగా నిర్ణయించిన ఎజెండా లేదు. 
ప్రధాన మంత్రి- పోప్ మధ్య సాధారణ ప్రపంచ పరిస్థితులు, సమస్యలు, ఇతర విషయాలపై చర్చ జరిగింది.

 
ప్రపంచాన్ని మెరుగుపరిచే వాతావరణ మార్పు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై చర్చించారు. కోవిడ్ మహమ్మారి, ఆరోగ్యం, శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు కలిసి పనిచేసే విధానంపై కూడా చర్చలు జరిగాయి.