ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (08:27 IST)

లాజిక్ మిస్సైన రైల్వే అధికారులు.. దక్షిణమధ్య రైల్వేకు షాకిస్తున్న ప్రయాణికులు

పండుగ సీజన్‌లో ప్రయాణికుల నుంచి డబ్బు దోచుకోవాలని దక్షిణమధ్య రైల్వే భావించింది. కానీ, తామేం తక్కువ తినలేదని నిరూపించిన ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వేకే తేరుకోలేని షాకిచ్చారు. ప్రయాణికుల తెలివితేటలకు రైల్వే ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. అసలు ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం. 
 
పండగ సీజన్‌లో ఫ్లాట్‌ఫామ్‌లపై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరను రూ.10 నుంచి ఏకంగా రూ.30 చేసింది. ఈ ధరను చూసిన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. పెంచిన ధరలు ఈ నెల పదో తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. 
 
ఉత్తి పుణ్యానికి రూ.30 చెల్లించాల్సి రావడం ఎందుకనుకున్న ప్రజానీకం అదిరిపోయే ప్లాన్‌తో రైల్వే శాఖకు షాకిచ్చింది. రైల్వే స్టేషన్‌కు వెళ్లే క్రమంలో ప్లాట్ ఫామ్ టికెట్‌కు బదులు పాసింజర్ ట్రైన్ టికెట్ కొనడం మొదలుపెట్టారు.
 
పాసింజర్ ట్రైన్ మినిమమ్ చార్జి రూ.10 కాగా, పది రూపాయలు పెట్టి పాసింజర్ టికెట్ కొని దర్జాగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై అడుగుపెడుతున్నారు. ఈ విధంగా రూ.20 ఆదా చేస్తున్నారు. అంతేకాదు, స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ వద్ద ఉన్న పాసింజర్ టికెట్‌ను ఇతరులకు ఇచ్చేస్తున్నారు. 
 
ప్లాట్ ఫామ్ టికెట్ల కన్నా పాసింజర్ టికెట్ల అమ్మకాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించడంతో అధికారులు ఆరా తీస్తే ఈ విషయం బయటపడింది. ఏదేమైనా రైల్వే అధికారులు ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు పెంచేటప్పుడు ఈ చిన్న లాజిక్ మిస్సయ్యారనే చెప్పాలి.