భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలి : విజయవాడ సీపీ
బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే వసరా ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసే భక్తుల పట్ల పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సూచించారు.
శరన్నవరాత్రుల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి శనివారం ఉదయం విజయవాడ ఏ.ఆర్ గ్రౌండ్స్, జ్యోతి కన్వెన్షన్ హాల్‌లో ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. దసరా ఉత్సవాలకు ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
ఆలయ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బందితోగానీ వీఐపీలతో వివాదాలకు తావులేకుండా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అధికారుల నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు.
క్యూ మార్గంలో తోపులాటలు, తొక్కిసలాట వంటి దురదుష్టకరమైన సంఘటనలు జరగకుండా భక్తులు క్రమపద్ధతిలో ముందుకు కదిలేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. నవరాత్రులు ముగిసేవరకూ ప్రతి ఒక్కరూ విధులు సక్రమంగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఉత్సవాల బందోబస్తులో విధులు నిర్వహించే సిబ్బందికి నిర్వహించిన సమావేశాల్లో జాయింట్ పోలీస్ కమీషనర్ డి.నాగేంద్రకుమార్, లా అండ్ ఆర్డర్ డీసీపీలు విజయరావు, డాక్టర్ హర్షవర్ధనరాజు, అడ్మిన్ డీసీపీ డి.కోటేశ్వరరావు, సి.ఎస్.డబ్ల్యూ డీసీపీ ఉదయరాణి, ఏడీసీపీలు నవాబ్ జాన్, శ్రీనివాసరావు, బాలవెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, నాగరాజు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు, బందోబస్తుకు హాజరైన పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.