శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (08:59 IST)

'నువ్వు మాకు నచ్చలేదు'.. బీజేపీకి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు

'నువ్వు నాకు నచ్చావ్'... ఇది విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం. ఇపుడు 'నువ్వు మాకు నచ్చలేదు'. ఈ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెటిజన్లు బీజేపీకి పెట్టిన పేరు. రాష్ట్ర విభజన సమయంల

'నువ్వు నాకు నచ్చావ్'... ఇది విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం. ఇపుడు 'నువ్వు మాకు నచ్చలేదు'. ఈ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెటిజన్లు బీజేపీకి పెట్టిన పేరు. రాష్ట్ర విభజన సమయంలో తల్లిని చంపి బిడ్డకు ప్రాణం పోసిందంటూ బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ, చేతల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీనే దగా చేసింది. గత నాలుగేళ్లుగా ఇదిగో సాయం.. అవిగో నిధులంటూ ఊరిస్తూ వచ్చిన బీజేపీ పాలకులు.. తమ హయాంలో ప్రవేశపెట్టిన చిట్టచివరి బడ్జెట్‌లో మొండిచేయి చూపారు. ఫలితంగా ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కమలం పార్టీకి ఏపీ నెటిజనులు చుక్కలు చూపిస్తున్నారు. 'నువ్వు మాకు నచ్చలేదు' అంటూ పార్టీ ఫేస్‌బుక్‌ పేజీని 'డిస్‌లైక్‌' చేస్తున్నారు. సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌ ఇస్తూ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బకు మూడుకుపైగా ఉన్న బీజేపీ ఫేస్‌బుక్‌ పేజీ రేటింగ్‌... సోమవారం నాటికి 1.1కి పడిపోయింది. 2018-19 వార్షిక బడ్జెట్‌కు ముందు ఫైవ్‌స్టార్‌ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సింగిల్‌ స్టార్‌ ఇస్తున్నారు. 
 
దీంతో బీజేపీ సోషల్‌ మీడియా విభాగం అప్రమత్తమైంది. తమ ఫేస్‌బుక్‌ పేజీలో 'డిస్‌లైక్' ఆప్షన్‌ను, రేటింగ్‌ కోరడాన్ని బ్లాక్‌ చేశారు. కానీ... కామెంట్లను నిలువరించలేదు కదా! "హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ అంటూ ఆ నిధులూ మంజూరు చేయలేదు. రైల్వే జోన్‌ ప్రకటించలేదు. చివరికి.. తాజా బడ్జెట్‌లో మొండిచేయి చూపారు" అంటూ జనం విరుచుకుపడుతున్నారు.