ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (08:54 IST)

తితిదే ఈవోగా శ్యామలరావు నియామకం : బాబు సర్కారు ఉత్తర్వులు

shyamala rao
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్య నిర్వహణాధికారిగా (ఈవో)గా జె.శ్యామలరావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తితిదే ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో కొత్త ఈవోగా శ్యామలరావును నియమించింది. ప్రస్తుతం ఈయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయ గతంలో కూడా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పని చేశారు. నిజాయితీపరుడిగా పేరున్న శ్యామలరావును తితిదే ఈవోగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంపిక చేసి ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో రాష్ట్రంలోని పలు కీలక పదవుల్లో ఉన్న వారు స్వచ్చంధంగా తప్పిస్తున్నారు. అలా తప్పుకోనివారిని ప్రభుత్వం బలవంతంగా ఇంటికి పంపుతుంది. అలాగే, తితిదే ఈవో ధర్మారెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. మరోవైపు, ఇటీవల తిరుమలకు వెళ్లిన చంద్రబాబు... రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన చేపడుతామని ప్రకటించారు. ఆ ప్రకారంగానే పాలనకు శ్రీకారం చుట్టారు.