రేషన్ సర్వర్ లో అంతరాయం... ప్రజలు, డీలర్లకు అగచాట్లు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సర్వర్ లో అంతరాయం ఏర్పడింది. దీనితో రేషన్ కోసం వచ్చిన ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్లపై ప్రజలు తమ కోపాన్ని ప్రదర్శించడంతో డీలర్లు సైతం తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.
నిన్నటి నుంచీ సమస్య ను పరిష్కరించని అధికారులు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్ తన నిరసన తెలిపారు. రేషన్ షాపుల వద్ద ప్రజల పాట్లు, తమపై తీవ్ర ఒత్తడిని కలిగిస్తున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వర్ సమస్య తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, డీలర్లు చేయని తప్పునకు మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్ చెపుతున్నారు. ఇంటింటికీ రేషన్ లో లేని సర్వర్ సమస్య, ఇప్పుడే ఎందుకొస్తుంది? ప్రతి నెలా ఇలానే ఉన్నా... అధికారులు స్పందించరా? సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా... సర్వర్ సమస్యను ఎందుకు సరి చేయడం లేదు... దీనిపై మాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొంటున్నారు.
రేషన్ సరఫరాకు సర్వర్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సమస్య ను పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్ డిమాండు చేశారు.