సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (08:20 IST)

క్షమాపణ చెప్తా: చంద్రబాబు

ఉపాధి కల్పన లక్ష్యంగా అమరావతిని నిర్మించాలనుకున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ‘ప్రజా రాజధాని అమరావతి’పై టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

హైదరాబాద్‌ కంటే గొప్పగా అమరావతిని నిర్మించుకునే అవకాశం మనకు ఉందన్నారు. ఈ ఆరు నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉండేవారన్నారు. రాజధాని ప్రాంతంలో 5,024 పేదల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. ఒకసారి రోడ్డు వేసిన తర్వాత మళ్లిd ఎప్పుడూ తవ్వాల్సిన అవసరం లేకుండా వేశామన్నారు.

రాజధానిని ముందుకు తీసుకెళ్లకపోతే యువత తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాజధాని ప్రాజెక్టు తప్పు అని ప్రజలు అంటే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అన్ని రాష్ట్రాలకు రాజధాని అనేది ప్రధాన ఆదాయ వనరు అని చంద్రబాబు నాయుడు అన్నారు.

రాజధానికి 53,748 ఎకరాలు భూమి సమకూరిందన్నారు. భవిష్యత్‌ అభివృద్ధి కోసం 5వేల ఎకరాలు కేటాయించామని, 8,039 ఎకరాలు రిజర్వు పెట్టుకున్నామని పేర్కొన్నారు. అమరావతికి 50వేల మందికి ఇళ్లు కట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములివ్వడం ఇదే ప్రథమమన్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో కేసు స్టడీగా పెట్టుకున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. అమరావతి బాండ్లు జారీ చేస్తే 2 గంటల్లో రూ.2వేల కోట్లు వచ్చాయన్నారు.