ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 మే 2020 (21:03 IST)

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే వార్షిక వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జరిగింది.
 
ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో సాయంత్రం పుణ్య‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నంతోపాటు అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. ఆ త‌రువాత శ్రీ విష్వ‌క్సేనుల‌వారిని ఆల‌య ప్రాంగణంలో ఊరేగింపు చేప‌ట్టారు.
 
ఈ ఉత్స‌వాల్లో భాగంగా మే 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు. 
 
క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈఓ సుబ్రమణ్యం, కంకణభట్టార్ మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు.