మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:32 IST)

చేయి వదలండి లేదంటే లోపలేయిస్తా... చేయి తాకారని రైతుపై కలెక్టర్ ఆగ్రహం

basanth kumar
ముంపు ప్రాంతాలకు చెందిన రైతులపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ తీవ్ర ఆగ్రహంతోపాటు అసహనం వ్యక్తం చేశారు. ఓ రైతు తన చేయి తాకినందుకు ఆగ్రహంతో రెచ్చిపోయారు. "చేయి వదలండి లేదంటే లోపలేయిస్తా"నంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. 
 
జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మండలంలోని పొడరాళ్ళపల్లి, గోపాలపురం, రామసాగరం గ్రామాలు ముంపు బారినపడుతున్నాయి. దీంతో ఆ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్ ఎదుట తమకు పరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. 
 
దీంతో కలెక్టర్ బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి వచ్చి పరిశీలించాలని ఓ రైతు కలెక్టర్ చేయిపట్టుకుని ప్రాధేయపడ్డారు. అప్పటికే రైతుల ఆందోళనపై అసహనంతో కలెక్టర్... "చేయి వందలండి... లేదంటే లోపలేయిస్తా" అంటూ మండిపడ్డారు. పైగా, ఎవరికీ అన్యాయం జరగదంటూ ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.