ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్న అమరావతి రైతులను అడ్డుకోండి : వైవీఎస్ పిలుపు
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వస్తున్న అమరావతి ప్రాంత రైతుల దండయాత్రను అడ్డుకోవాలని తితిదే ఛైర్మన్, వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వాసులకు పిలుపునిచ్చారు.
విశాఖ నార్త్ కార్యాలయంలో వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు అమరావతి రైతులు వస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో దండయాత్రకు వస్తున్న వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖను రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.
విశాఖ అభివృద్ధి ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలని, ఇపుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని వైవీఎస్ అన్నారు.