గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:06 IST)

రాజకీయ ఒత్తిళ్లతోనే సస్పెండ్‌.. క్యాట్‌ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు

ఇటీవల సస్పెన్షన్​కు గురైన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్​)ను ఆశ్రయించారు. తనపై విధించిన సస్పెన్షన్‌ చట్టవిరుద్దమని ప్రకటించాలని కోరుతూ క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు.

గతేడాది మే 31 నుంచి ప్రభుత్వం తనకు వేతనం చెల్లించడం లేదని క్యాట్‌కు తెలియజేశారు. నిరాధారమైన ఆరోపణలతో సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్​లో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనను సస్పెండ్‌ చేశారని... ఆ ఉత్తర్వులు కొట్టేయాలని కోరారు.

ఆరోపణలు నిరాధారం భద్రత పరికరాల కొనుగోళ్లకు సంబందించిన తనపై ఆరోపణలు నిరాధారమని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ నిబంధనల ప్రకారం కొనసాగుతుందని తెలిపారు. కొనుగోళ్ల కోసం ఓ అధికారిని నియమిస్తారని... ఆడిట్, ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన తర్వాతే ఫైల్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వస్తుందని వివరించారు.

ప్రాథమిక విచారణ జరపకుండా.. కనీసం తన వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనేనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. సస్పెన్షన్ విషయంపై టీవీలు, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయని.. తన కుటుంబ సభ్యులను సైతం బలిపశువుల్ని చేశారని వాపోయారు.

గత ప్రభుత్వంలో కీలక హోదాల్లో పని చేసినందున.. రాజకీయ కక్షతోనే తనపై సస్పెన్షన్​ విధించారని పేర్కొన్నారు. నిజాయతీగా ఉన్నా.. 1989లో ఐపీఎస్​లో చేరిన తాను ముప్ఫై ఏళ్లుగా ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ... ఎక్కడా ఎలాంటి ఆరోపణలు తనపై లేవని వివరించారు.

బోస్నియా, కొసోవాలో శాంతి కోసం పని చేసినందుకు.. ఐరాస శాంతి మెడల్ వచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో చేసిన సస్పెన్షన్​ను.. రద్దు చేయాలని కోరారు. తనకు రావాల్సిన వేతన బకాయిలు విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.