ఈశాన్య గాలుల ప్రభావం.. తిరోగమిస్తున్న రుతుపవనాలు
ఈశాన్య గాలుల ప్రభావం కారణంగా రుతుపవనాలు తిరోగమిస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా, నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్, మజలి ప్రాంతాల మీదుగా వెళుతున్నాయని పేర్కొంది. వచ్చే 48 గంటల పాటు ఇదేపరిస్థితి కొనసాగుతుందని తెలిపింది.
అదేసమయంలో రాగల 48 గంటలలో ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరం, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.