మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

చిక్కుల్లో తాడికొండ ఎమ్మెల్యే?

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి చిక్కుల్లో పడ్డారు. ఆమె కులధృవీకరణ వివాదంపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్‌ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్‌ దుర్వినియోగంపై వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఏపీ చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.

క్రిస్టియన్‌ మతం మారినట్లుగా చెప్పుకుంటున్న ఉండవల్లి శ్రీదేవి.. ఎస్సీ కేటగిరీ కింద సర్టిఫికెట్ పొందారు. ఆ మేరకు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ విచారణ కీలకం కానుంది. అయితే చీఫ్ సెక్రటరీ రాష్ట్రపతికి ఎలాంటి నివేదిక పంపుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.

రాష్ట్రపతి భవన్‌తో వ్యవహారం కాబట్టి తప్పుడు సమాచారం పంపే అవకాశం లేదంటున్నారు. అదే జరిగితే ఉండవల్లి శ్రీదేవి పదవి పోగొట్టుకోవడమే కాదు న్యాయపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరం సంస్థ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది.

మతం మారినందున ఆమెకు రిజర్వేషన్ వర్తించదని అయినా.. దళిత మహిళగా చెప్పుకుని ఎస్సీలకు చెందిన సీటు నుంచి పోటీ చేసి దళితులను మోసం చేశారని ఆరోపిస్తోంది లీగల్ రైట్‌ ప్రొటక్షన్‌ ఫోరం సంస్థ. చట్టం ప్రకారం దళితులు మతం మార్చుకుంటే వారు ఎస్సీ హోదా కోల్పోతారు. అలాగే వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వర్తించే ప్రయోజనాలు కూడా కోల్పోతారు.

అంతేకాదు.. వినాయక చవితి వేడుకుల్లో తనను కులం పేరుతో దుషించారంటూ తూళ్లురు పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు దాఖలు చేసారు శ్రీదేవి. ఈ ఘటనపై అప్పట్లో సీఎం జగన్‌ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోంమంత్రిని ఆదేశించారు సీఎం జగన్‌.

ఫలితంగా టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయి. క్రిస్టియన్‌ అని చెప్పుకుంటున్న శ్రీదేవి.. తమపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఆమె పెట్టిన కేసులు చెల్లవంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.