చంద్రబాబుకు షాక్... హ్యాండిచ్చిన అంబికా కృష్ణ
టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ, తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అంబికా కృష్ణ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో అంబికా కృష్ణ బీజేపీలో చేరనున్నారు.
ఇటీవలే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామమోహన్‌లు రాజ్యసభలో చేరిన విషయం తెల్సిందే. ఇపుడు అంబికా కృష్ణ కాషాయ కండువా కప్పుకోనున్నారు. వీరంతా బడా పారిశ్రామికవేత్తలు. తమ వ్యాపారం సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు, వ్యాపారంలో ఉన్న లొసుగుల నుంచి బయటపడేందుకు వీలుగానే వీరంతా బీజేపీలో చేరుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాగా, గత 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబికా కృష్ణను ఫిల్మ్, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి పీతల సుజాతపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అనంతరం తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. బాలకృష్ణతో కూడా అంబికా కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారతుండటం టీడీపీకి పెద్ద లోటనే చెప్పాలి.