శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Updated : శనివారం, 22 జూన్ 2019 (18:15 IST)

ఆ పార్టీ నేతలను చేర్చుకొని బిజెపి రాజకీయ తప్పిదం చేసిందా.. ఎలా?

నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు తమను బీజేపీలో విలీనం చేయమని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు తమ సమ్మతి పత్రాన్ని సదరు నేతలు సమర్పించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడమా? అసలు బాబు ప్లాన్లో భాగమేనా? అన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానం కాలం చెపుతుంది. కీలక విషయం టిడిపి నేతలను చేర్చుకోవడం ద్వారా బీజేపీ బలపడటం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
 
రాజకీయ సమీకరణాలతో సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీ బలపడటం లేదా బలహీన పడటం జరగని పని. బలప్రదర్శన, అధికార దర్పంతో ఏ పార్టీ బలపడినట్లు చరిత్రలో కనపడదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పార్టీ స్థాపించడంతో వైసిపి, టిడిపి పార్టీల మధ్య ప్రజలు చీలి ఉన్నారు. మరో కొత్త పార్టీకి స్థానం దక్కాలంటే ఈ రెండు పార్టీలలో ఒకటి బలహీనపడాలి. టిడిపి ఓడిపోయినది. వైసిపి అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ దశలో కూడా టిడిపికి లభించిన ఓట్లు 40 శాతం. 
 
ఇంత వ్యతిరేక పరిస్థితిలో కూడా ఆపార్టీకి 40 శాతం ఓట్లు రావడం చిన్న విషయం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాలలో టిడిపి డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి నుంచి ఏకంగా అధికారంలోకి వచ్చిన విషయం దాచినా దాగదు. మరోవైపు అధికారంలోకి వచ్చిన జగన్ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామం జగన్ పట్ల ప్రజలలో ఆదరణ పెరిగింది. అందుకే బాబు వైసిపి నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కారణం కొత్తగా అందులోనూ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీపై రాజకీయ విమర్శలు చేయడం నష్టం అన్న అంచనాతోనే ఉన్నారు. 
 
బిజెపి దేశంలో విజయం సాధించినా ఆ పార్టీకి దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో మినహా మరో రాష్ట్రంలో స్థానం లేదు. కేరళలో బలపడాలన్న ప్రయత్నం సఫలం కాలేదు. తమిళనాడులో కేంద్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని బలపడాలని ప్రయత్నించి బలహీన పడింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి ఆశలు పెరిగాయి కారణం అక్కడ కెసిఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ బలహీన పడటం. ఈ పరిణామాలు చెపుతున్నది రాజకీయ సమీకరణాలు కలిసి రాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని బలపడటం సాధ్యం కాకపోగా బలహీన పడే పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యే అవకాశం లేక పోలేదు. కానీ అధికారం ఆపార్టీని అటువైపు ఆలోచించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
ఏపీలో భాజపా ఎదుగుదలకు అవకాశాలతో బాటు అవరోధాలు కూడా బలంగానే ఉన్నాయి. విభజన కారణంగా కాంగ్రెస్, రాష్ట్రంలో భారీ మూల్యాన్ని చెల్లించుకున్నది. అటు పిమ్మట అధికారంలోకి వచ్చిన బీజేపీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏనాడు ప్రయత్నం చేయలేదు. టిడిపి రాజకీయ చట్రంలో ఇరుక్కున్న బిజెపి ఏనాడు స్వతంత్రంగా రాజకీయాలు చేయలేదు. ఫలితం... ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లభించని అతి తక్కువ ఓట్లను నమోదు చేసుకున్నది రాష్ట్రంలో. దేశంలో లభించిన విజయంతో ఈ వాస్తవాలు వారికి కనపడక పోవచ్చును. 
 
మళ్ళీ ఆ పార్టీకి రాష్ట్రంలో బలపడడానికి అవకాశం ఉంది. కేంద్రం చేయాల్సిన సాయం నిజాయితీగా చేయడం అందులోనూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కాదు కాబట్టి తన స్వతంత్రకు నష్టం రాదు. అధికార పార్టీ రాజకీయ తప్పిదం చేసి , టిడిపి సరైన పాత్ర పోషించని పరిస్థితి ఏర్పడినపుడు బిజెపికి రాష్ట్రంలో అవకాశాలు మెరుగుపడతాయి. అంత ఓపిక , నిజాయితీ బిజెపి నాయకత్వానికి ఉండాలంటున్నారు విశ్లేషకులు. 
 
ఏపీలో జగన్ ప్రజాసానుకూల పరిస్థితి కారణంగా అధికారంలోకి వచ్చినారు. టిడిపి ప్రజా ఆగ్రహానికి గురైన పార్టీ. బిజెపి పార్టీతో జగన్ ఏనాడు రాజకీయ వైరాన్ని ప్రదర్శించలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో బిజెపి గెలవాలని జగన్ అబిమానులు కోరుకున్నారు. ఈ దశలో టిడిపి నేతలను చేర్చుకొని వెంటనే బలపడాలనే బీజేపీ అడుగులు జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే ప్రజల దృష్టిలో శత్రువుగా మారుతుంది. అలా మెజారిటీ ప్రజకు బిజెపి దూరం అవుతుంది. అలాని టిడిపి నేతలను చేర్చుకొంటే బలపడుతుందా అంటే అందుకు అవరోధాలు లేక పోలేదంటున్నారు. 
 
టిడిపి ఓడిపోయిన పార్టీ కావచ్చు కానీ 40 శాతం ఓట్ల సాధించి , బలమైన పునాదులు కలిగి ఉన్న పార్టీ, బీజేపీలో చేరిన వారు ప్రజలలో ఆదరణ లేని వారు. అందులోనూ సుజన, రమేష్ లాంటి వారికి పైరవీకారులన్న ముద్ర ఉంది. ఈ రెండు కారణాలను పరిశీలిస్తే టిడిపిలో నాయకత్వం బలహీనపడింది... అన్న అంచనాకు వెంటనే రావడం తొందరపాటు అవుతుంది. ఒకవేళ బలహీనపడినా టిడిపి నాయకులు చేరినంతగా ఆ పార్టీ శ్రేణులు చేరరు. ఇంతకుమించిన సమస్యలను బాబు నాయకత్వంలో ఆ పార్టీ అధిగమించిన విషయం తెలిసిందే. 
 
అందులోనూ బిజెపితో తీవ్రంగా విభేదించిన టిడిపి శ్రేణులు అదే పార్టీలోకి ఎందుకు వెళతారు. నాయకులది ఆర్థిక సమస్యలు కానీ ప్రజలు, శ్రేణులవి వేరే సమస్య. రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పైపెచ్చు బీజేపీలో చేరిన సుజన, రమేష్‌లకు వ్యతిరేకంగా ఆర్థిక అవకతవకలు జరిగాయని విచారణ చేపట్టారు. బీజేపీలో చేరారు కాబట్టి విచారణ నిలిచిపోతుంది. ఈ ఒక్క కారణం చాలు బిజెపి పట్ల ప్రజలలో వ్యతిరేకత రావడానికి. 
 
ఎలాగూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో లోపం, హోదా ఇవ్వని కారణంగా మరియు  హుందాగా కేంద్రంతో ఉన్న జగన్‌కు వ్యతిరేకంగా రాజకీయాలా అన్న వ్యతిరేకత ఒకవైపు ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను చేర్చుకుని వారిపై విచారణలు నిలుపుదల చేస్తే సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందంటున్నారు విశ్లేషకులు. టిడిపి నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారు పైరవినేతలే తప్ప ప్రజానేతలు కాక పోవడంతో టిడిపి శ్రేణులు వెళ్ళరు. ఫలితంగా బిజెపి సమీప భవిష్యత్తులో బలపడడానికి ఉన్న అవకాశాలు టిడిపి నేతలను చేర్చుకుని అవరోధంగా మార్చుకోవడం మాత్రం బీజేపీ స్వయంకృతాపరాధం అనక తప్పదంటున్నారు విశ్లేషకులు.