మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 1 నవంబరు 2021 (10:23 IST)

పోలీసులకు ఒకటో తేదీన జీతాల్లేవు... సీఎంకు తెదేపా ఎమ్మెల్యే అనగాని లేఖ

రేయింబవళ్లు సైనికుల్లా పనిచేసే పోలీసు సిబ్బందికి ఒకటో తేదీన వేతనాలివ్వడం లేదని, టీఏ, డీఏలూ సకాలంలో చెల్లించడం లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంతో పెన్షనర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. 
 
 
‘కరోనా సమయంలో వైరస్‌ బారినపడి వందలాది పోలీసులు తనువు చాలించారు. అంతకు రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులు ఆర్థికంగా చితికిపోయారు. వారికి ప్రభుత్వ సాయం అందలేదు. కనీసం మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. పదవీ విరమణ చేసిన వారికి సదుపాయాలు అందడం లేదు. పోలీసు సిబ్బందికి ఇళ్లస్థలాలు, ఇళ్ల నిర్మాణం జాడే లేదు. పోలీసుక్వార్టర్ల నిర్మాణాలు అతీగతీ లేకుండా పోయాయి. హామీలివ్వడం తప్ప వాటి అమలులో చిత్తశుద్ధి కరవైంది’ అని సీఎం జగన్‌కు రాసిన బహిరంగ లేఖలో విమర్శించారు.
 
 
‘అధికారంలోకి వచ్చిన కొత్తలో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు ఇస్తామన్నారు. రెండున్నరేళ్ల తర్వాత పోలీసు అమరవీరుల దినోత్సవంలోనూ మళ్లీ హామీనివ్వడం ఆశ్చర్యకరం. వారాంతపు సెలవుపై నివేదిక సమర్పించి రెండేళ్లవుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? అసెంబ్లీ సమావేశాలు, ఇతర ప్రొటోకాల్‌ విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి కనీస వసతి కల్పించకపోవడంతో రోడ్లపైనే సేదదీరే పరిస్థితి ఉంది. కానిస్టేబుళ్లు, ఎస్సై, ఏఎస్సైలకు పదోన్నతులు లేవు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు శాఖలోని ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని హామీనిచ్చినా, ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలే లేవు’ అని సత్యప్రసాద్‌ లేఖలో విమర్శించారు.