సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో కుప్పం బయలుదేరారు. ప్రతిపక్షనేత చంద్రబాబు రాక నేపథ్యంలో ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని రాళ్లబూదుగూరుకు వద్దకు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు చేరుకున్నారు. టీడీపీ అధినేతను పూలు చల్లి స్వాగతించారు.
అనంతరం భారీగా టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు రాకతో రహదారులు పసుపుమయం అయ్యాయి. రెండు రోజుల పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక్కడ బహిరంగ సభలో కూడా చంద్రబాబు ప్రసంగించనున్నారు.
ఏపీలో తెలుగుదేశం నేతల ఇళ్లపై, పార్టీ జాతీయ కార్యాలయంపై దాడుల అనంతరం నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష వహించారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు సంఘీభావం తెలుపుతూ, పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అయితే, కుప్పం నియోజకవర్గం నుంచి సామాన్య కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాలేని పరిస్థితుల్లో, సొంత నియోజకవర్గంలో తానే పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇపుడు కుప్పంలో ఆయన రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు.