1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 28 అక్టోబరు 2021 (12:07 IST)

క‌ల‌వ‌లేక‌పోయా... చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ - జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్క‌డ రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. దీంతో పాటుగా మరో మూడు డిమాండ్లను ప్రధానంగా వినిపించారు. ఇదే సమయంలో ప్రధానితో పాటుగా కేంద్ర హోం మంత్రిని కలవాలని చంద్రబాబు భావించారు. అయితే, ఆ ఇద్దరి నుంచి అప్పాయింట్ దొరకలేదు. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు వచ్చేసారు.
 
 
చంద్రబాబుకు అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవటం పైన వైసీపీ స్పందించింది. చంద్రబాబు వ్యవహార శైలి తెలిసే వారు టీడీపీ అధినేతను దూరం పెట్టారంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి పైన చేసిన అనుచిత వ్యాఖ్యల తరువాత టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన వెంటనే చంద్రబాబు గవర్నర్ తో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. పార్టీ కార్యదర్శి ద్వారా లేఖ పంపాలని షా సూచించినట్లుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.
 
 
అదే సమయంలో దేశ చరిత్రలో పార్టీ కార్యాలయం పైన ఎప్పుడూ దాడి జరిగిన సందర్భాలు లేవని..కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని చంద్రబాబు కోరారు. ఇక, ఈ రోజు అమిత్ షా టీడీపీ అధినేతకు ఫోన్ చేసారు. రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులను చంద్రబాబు ఆయనకు వివరించారు. దేశంలో ఎక్కడ గంజాయి..డ్రగ్స్ దొరికినా ఏపీలో మూలాలు ఉంటున్నాయంటూ ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందంటూ ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని చంద్రబాబు వివరించినట్లుగా చెబుతున్నారు.
 
 
ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు వివరించారు. అదే విధంగా తాము రాష్ట్రపతికి అందించిన వినతిపత్రం, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో, వీడియోతో సహా పంపుతానని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. రెండు రోజులు ఢిల్లీలో ఉన్నా.. ప్రధాని - అమిత్ షా అప్పాయింట్ మెంట్ దొరక్కపోవటం పైన టీడీపీ నేతలు రాజకీయంగా ఇరకాటంలో పడ్డారు. వైసీపీ నేతలు ఈ విషయం పైన స్పందించారు. ఇక, ఇప్పుడు అమిత్ షా ఫోన్ చేయటం ద్వారా టీడీపీ నేతలకు కొంత రిలీఫ్ దొరికినట్లయింది.
 
 
అమిత్ షా బిజీగా ఉండటం వలనే తమకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని... ఆయన పోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీలు గురువారం సాయంత్రం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు అప్పాయింట్ మెంట్ తీసుకున్నారు. టీడీపీ చేస్తున్న రాజకీయాలు..ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు...తిట్ల గురించి సీడీలతో ఫిర్యాదు చేస్తూ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ డిమాండ్ చేయాలని నిర్ణయించారు.
 
 
దీంతో పాటుగా రాష్ట్రపతిని కలవాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పైన ఒక పుస్తకం ప్రచురించి.. రాష్ట్ర ప్రభుత్వం పైన టీడీపీ ఫిర్యాదు చేయటంతో దీనికి కౌంటర్ గా పట్టాభి చేసిన వ్యాఖ్యలు..చంద్రబాబు ఏ విధంగా సమర్దించారో వివరిస్తూ రాష్ట్రపతికి పూర్తి ఆధారాలు ఇస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ఇందు కోసం రాష్ట్రపతితో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.