గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శుక్రవారం, 29 అక్టోబరు 2021 (15:50 IST)

రోజాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నేతలు, ఎవరు?

ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్న రోజా ఇప్పుడు సొంతపార్టీ నేతల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన సొంత నియోజకవర్గం నగరిలోని పలు మండలాల్లో ఒక్కొక్కరుగా రోజా వ్యతిరేకులు ఏర్పడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా రోజాను గెలిపించిన వారే దూరమవుతూ వ్యతిరేకులుగా మారడంతో రోజాను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందట.

 
తాజాగా జనాగ్రహ దీక్ష పేరుతో వైసిపి నేతలు చేపట్టిన కార్యక్రమంలో రోజా వ్యతిరేకులు వేరుగా కార్యక్రమాన్ని నిర్వహించడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసిందట. అందులోను విజయపురం మండలంలో చక్రపాణిరెడ్డి లాంటి వ్యక్తులు వ్యతిరేకులు కావడం.. రోజా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అందులో పాల్గొనకుండా వేరు కార్యక్రమాలు పెట్టడమే రోజాకు తలనొప్పిగా మారుతోందట.

 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికే విషయాన్ని తీసుకెళ్ళారు రోజా. అప్పట్లో కాస్త సద్దుమణిగింది అనిపించినా మళ్ళీ తిరిగి అదే తంతు. పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులందరూ రోజాకు పూర్తి దూరంగా ఉంటున్నారట. దీంతో రోజాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. అసలు రోజాను బాగా ఇబ్బందులు పెడుతున్న నేతలు నగరిలో కెజె శాంతి, కెజె కుమార్ వర్గం, విజయపురం మండలంలో చక్రపాణిరెడ్డి, పుత్తూరులో అమ్ములు వర్గం ఇలా రోజాను ఒక్కో మండలంలో ఒక్కో విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారట.

 
ఇక రోజాకు అంతో ఇంతో పట్టున్న మండలం ఒక్క వడమాలపేట మండలమే. ఇక్కడైతే ఎలాంటి వ్యతిరేకులు లేరట. వ్యతిరేకులను ఎలా బుజ్జగించాలో.. వారిని తన దారికి ఎలా తెచ్చుకోవాలో తెలియక సతమతమవుతున్నారట రోజా. త్వరలోనే నేతలతో ఉన్న విభేధాలు సమసిపోతాయన్న నమ్మకంతో ఉన్నారట రోజా.