మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:59 IST)

వైజాగ్ ఉక్కు కోసం... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు

విశాఖ ఉక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. లెటర్‌ హెడ్‌పై స్వయంగా రాసిన రాజీనామా లేఖను స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు పంపినట్టు తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభం కాగానే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజీనామా అన్నది తన వ్యక్తిగత నిర్ణయమన్నారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయి. విశాఖ ఉక్కును రక్షించుకోడానికి త్వరలోనే రాజకీయాలకు అతీతంగా సంయుక్త కార్యాచరణ కమిటీ (నాన్‌ పొలిటికల్‌ జేఏసీ) ఏర్పాటు చేస్తా. విశాఖ ఒడిలో పెరిగి, ఎదిగిన నాకు రుణం తీర్చుకునే అవకాశం ఈ విధంగా వచ్చినట్టు భావిస్తున్నా. 
 
సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగేలా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాలి. విశాఖ ఉక్కు కు సొంత గనులు లేకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయి. కాబట్టి వెంటనే గనులను కేటాయించి ఆదుకోవాలి. అలా చేస్తే టన్నుకు రూ.5 వేలు ఆదా అవుతుంది అని గంటా వివరించారు. 
 
కాగా, రాజీనామా లేఖ స్పీకర్‌ ఫార్మెట్‌లో లేనందున అది చెల్లుబాటు కాదని పలువురు ప్రస్తావిస్తున్న విషయంపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. అది పెద్ద విషయం కాదన్నారు. అవసరమైతే తన రాజీనామాను ఫార్మెట్‌లోనే పంపుతానని స్పష్టం చేశారు.