ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 20 జనవరి 2022 (14:24 IST)

చీకటి జీవోల‌ను ర‌ద్దు చేయాలి... ఉపాధ్యాయుల సీపీఎస్ ఉద్య‌మం

సీపీఎస్ ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉపాద్యాయ సంఘాలు ఉద్యమించాయి. సీఎంతో చ‌ర్చ‌ల అనంత‌రం, ఎన్జీవోలు పిఆర్ సీ ప్ర‌క‌ట‌న‌లో విఫ‌లం కావ‌డంతో, ఇపుడు ఉద్యోగులు త‌మ‌దైన శైలిలో పోరుబాట ప‌ట్టారు. రాష్ట్రంలోని వివిధ న‌గ‌రాల‌లో క‌లెక్ట‌రేట్ల‌ను ముట్ట‌డించారు.
 
 
వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను దగా చేసింద‌ని, సీపీసీ విధి విధానాలను వెంటనే మార్చాలని, ఉద్యోగులకు ఫిట్మెంట్ విషయంపై  వెంటనే ప్రభుత్వం పునరలోచించాల‌ని ఉద్యోగులు డిమాండు చేశారు. హెచ్ ఆర్ ఏ స్లాబ్స్ విధానాన్ని యధాతధంగానే ఉంచాల‌ని, సి సి ఎ పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాన్ని సిపిసి అమ‌లు చేయాల‌ని డిమాండు చేశారు. 27శాతం పేరుతో ఉద్యోగులకు మోసపూరిత వాగ్ధానం వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. 
 
 
చీకటి జివోలు1,2,8,9లను వెంటనే రద్దు చేయాలని, విశ్రాంత ఉద్యోగులకు పాత  పింఛ‌ను విధానాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు. పక్కదారి మళ్లించిన పిఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దాదాపుగా 2,100 కోట్ల లోన్లు నిలిచిపోయాయ‌ని, వాటిని వెంటనే అమలు చేయాల‌ని డిమాండు చేశారు. 
 
 
విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడికి వేలాదిగా ఉపాధ్యా ఉద్యోగ సంఘాలు చేరుకున్నాయి. కలెక్టరేట్‌కు చేరుకునే అన్ని మార్గాల నుంచి ఉద్యోగ సంఘాలు దూసుకొచ్చాయి. పోలీస్ వలయాన్ని చేధించుకుంటూ కలెక్టరేట్ గేటు వద్దకు ఉద్యోగులు చేరుకున్నారు. పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ తమను మోసం చేశారంటూ నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు తీవ్ర స్థాయిలో పోరాడుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.