శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (15:29 IST)

RTC Strike: కేసీఆర్ సర్కారుకి హైకోర్టు చురకలు, ప్రజలు తిరగబడితే తట్టుకోలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు

ప్రజలు చాలా శక్తిమంతులని, వాళ్లు తిరగబడితే ఎవరూ ఆపలేరంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గత 14 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై శుక్రవారం మరోమారు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలను ఆలకించిన తర్వాత హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కార్మికుల డిమాండ్లలో చాలా మేరకు నెరవేర్చదగ్గవేనని కోర్టు అభిప్రాయపడింది. పైగా, ఆర్టీసీ కార్మికులకు ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీసింది. పైగా, ప్రజలు శక్తిమంతులనీ, వారు తిరగబడితే ఎవరూ ఆపలేరంటూ కోర్టు హెచ్చరించింది. 
 
సమ్మె ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ఎందుకు ఆపలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరికొంత మంది ఆర్టీసీకి మద్దతు తెలిపితే ఆందోళనను ఎవరూ ఆపలేరని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులని... వారు తిరగబడితే తట్టుకోలేరని వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కొత్త ఎండీనీ నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని... ఆర్టీసీకి సమర్థవంతమైన ఇన్‌ఛార్జి ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఆయన సమర్థవంతుడు అయినప్పుడు... ఆయననే ఎండీగా నియమించవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. 
 
మరోవైపు, ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్ర స్థాయి బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ఎన్జీవో సంఘాలతో పాటు ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరోవైపు, రేపటి బంద్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అదేసమయంలో ఆర్టీసీ ఆర్థిక స్థితిపై నివేదికను తెరాస సర్కారు సమర్పించింది.