రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం
రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇటీవల రామతీర్థంలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహానికి జరిగిన అపచారానికి సంబంధించి టీడీపీ, బీజేపీ నేతల నిరసన, అదే సమయంలో వీరికి వ్యతిరేకంగా వైసీపీ వర్గాల ప్రవేశంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉదయం నుంచి రామతీర్థంలో టెన్షన్ టెన్షన్‌గా పరిస్థితులు ఉన్నాయి. ఓ వైపు మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటించడం.. మరోవైపు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటిస్తున్నారు. దీంతో భారీగా ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలు రామతీర్థానికి చేరుకున్నారు.
వీరితో పాటు బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. అగ్రనేతల పర్యటనతో రామతీర్థంలో హై టెన్షన్ నెలకొంది.
కారు అద్దాలు ధ్వంసం..
ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై నిరసనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత మరో కారులో వెళ్లిన విజయసాయి కొండపై ఆలయాన్ని పరిశీలించారు.
అయితే కొండపైకి కూడా వైసీపీ జెండాలతో వెళ్లి కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారు. దేవుడి దగ్గరికి ఇలా వెళ్లడమేంటి..? ఇదేమైనా పార్టీ ఆఫీసు అనుకుంటున్నారా..? దేవాలయం అనుకుంటున్నారా..? అంటూ టీడీపీ, బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రామతీర్థం గుడిమెట్లపై వైసీపీ నేతలు బైఠాయించారు. చంద్రబాబును కొండపైకి వెళ్లనివ్వమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా భారీగా పోలీసులు మోహరించారు.
రోడ్డుపై బైఠాయింపు..
అంతకుముందు రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికే అనుమతి ఇచ్చారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్‌కి అనుమతి ఇచ్చి.. మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతల వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 3 రోడ్ల జంక్షన్ వద్ద మమ్మల్ని అడ్డుకున్నారని, చంద్రబాబుతో కలిసి తమని వెళ్లనివ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పోలీసులు అడ్డగించడంతో మాజీ మంత్రి చినరాజప్ప ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత నడుచుకుంటూ వెళ్లి, ఆటోలో రామతీర్థానికి బయలుదేరారు.