ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (17:47 IST)

ఏప్రిల్ 17 'తిరుపతి' లోక్‌సభ - 'సాగర్' అసెంబ్లీకి ఉప ఎన్నిక

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా మోగింది. సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది.
 
ఏప్రిల్ 17వ తేదీన తిరుపతితో పాటు నాగార్జునసాగర్‌లోనూ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 30న నామినేషన్లకు చివరి రోజు కాగా మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 
 
గతంలో తిరుపతి లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ స్థానంపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేశాయి. 
 
ఇప్పటికే తెలుగు దేశం పార్టీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ కూడా తన అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది.  బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతిస్తున్నట్లు సమాచారం. 
 
మరోవైపు అధికార పార్టీ వైసీపీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదు. సీఎం జగన్ వ్యక్తిగత డాక్టర్‌ గురుమూర్తిని తిరుపతి బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన పార్టీలు కూడా అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
 
గత సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా నోముల నరసింహయ్య గెలిచారు. అనంతరం ఆయన ఆకాల మరణం చెందడంతో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు కూడా ఎన్నికకు రెడీ అయ్యాయి. 
 
గత ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఈ  స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ స్థానంలో మరోసారి జానా రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఆయన కుమారుడిని ఎన్నికల బరిలో దించేందుకు జానా రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు బీజేపీ కూడా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అభ్యర్థిపై కసరత్తులు ప్రారంభించింది. ఇక టీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థిని పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి భార్యను పోటీ చేయించినట్లుగా నాగార్జున సాగర్ ఉపఎన్నికలో నోముల సతీమణిని పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. 
 
ఇక అక్కడి కార్యకర్తల అభీష్టం మేరకు తమ అభ్యర్థిని రంగంలోకి దించేందుకు రెడీ అయినట్లు సమాచారం. అటు టీటీడీపీ కూడా తమ అభ్యర్థిని పోటీలో నిలిపిందుకు ఆ పార్టీ అధిష్టానం రెడీ అయింది. మిగిలిన పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.