శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (15:12 IST)

భారత రైల్వేలు దేశానికి ‘వృద్ధికి ఇంజిన్’ .. ప్రైవేటీకరించం : పియూష్ గోయల్

భారతీయ రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం స్పష్టం చేశారు. 
 
పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో రైల్వేలకు నిధుల కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గోయల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించొచ్చన్నారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి పథంలో పయనించగలదని చెప్పారు.
 
‘‘రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోం. ఇది ప్రతి భారతీయుడి ఆస్తి. ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటుంది. అయితే రైల్వేలో సేవలను మరింత మెరుగుపర్చడం కోసం ప్రైవేటు పెట్టుబడులను మేం స్వాగతిస్తాం’’ అని గోయల్‌ వెల్లడించారు. 
 
అయితే, ‘రైల్వేలను ప్రైవేటీకరించినట్లు మాపై ఆరోపణలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వ వాహనాలు మాత్రమే రోడ్లపై నడపాలని ప్రజలు ఎప్పుడూ అనరు. ఎందుకంటే ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలు రెండూ ఆర్థికంగా సహాయపడతాయి. రైల్వేలో పెడుతున్న ప్రైవేట్ పెట్టుబడులు ఇక్కడ సేవలను మరింత మెరుగు పరుస్తాయనే ఉద్దేశంతోనే మనం స్వాగతించాలి" అని గోయల్ చెప్పారు. 
 
‘భారత రైల్వేలు దేశానికి ‘వృద్ధికి ఇంజిన్’గా పనిచేయాలని మేం కోరుకుంటున్నాం. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రైల్వేల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించాం’ అని పియూష్‌ గోయల్‌ తెలిపారు. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే కేటాయింపులను ప్రభుత్వం భారీగా పెంచిందని ఆయన తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.1.5లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2.15లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు.
 
రైలు ప్రయాణికుల భద్రతపై తాము గట్టిగా దృష్టిపెట్టామని గోయల్‌ ఈ సందర్భంగా అన్నారు. గత రెండేళ్లుగా ఒక్క రైలు ప్రయాణికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2019 మార్చి తర్వాత నుంచి రైలు ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు.
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశ రైల్వే మౌలిక సదుపాయాలు కొత్త విజన్‌ను చూశాయని, రైల్వే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలకు సమృద్ధిని తీసుకొచ్చినట్లు లోక్‌సభలో రైల్వే గ్రాంట్స్ డిమాండ్లపై చర్చకు సమాధానమిస్తూ పియూష్‌ గోయల్ చెప్పారు.