గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (09:00 IST)

అనంతపురం జిల్లాలో రాత్రి 7 గంటల వరకు అన్ని షాప్ లకు అనుమతి

అనంతపురం జిల్లాలో రాత్రి 7 గంటల వరకు అన్ని షాప్ లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే కదలిక ఆంక్షలను సడలిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని కంటైన్మెంట్ క్లస్టర్ లలో మాత్రం యథాతథంగా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
 
కోవిడ్ నేపథ్యంలో ఇంతకుముందు జిల్లాలో మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని షాపులు తెరచుకునేందుకు అనుమతి ఉండగా, ఇప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చన్నారు. ఇప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని, అనంతరం అమలులో ఉన్న ఆంక్షలు కొనసాగుతాయన్నారు.

అయితే షాపుల వద్ద ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ ను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరైనా  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శాని టైజర్ లను ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని కలెక్టర్ సూచించారు.
 
అలాగే జిల్లాలోని  కంటైన్మెంట్ క్లస్టర్ లలో ప్రభుత్వ నియమ నిబంధనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.