బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (18:00 IST)

విజయవాడ వరద పరిహారం, సర్వే గణాంకాల్లో తప్పులు, సిబ్బంది నిర్వాకం?

Flood victims
విజయవాడ వరద బాధితుల్లో చాలామందికి సాయం అందలేదని అంటున్నారు. ఇప్పటికే పలు కాలనీల్లోని ప్రజలు రోడ్లెక్కి తమకు పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితుల ఇళ్లకు వచ్చి సర్వే చేసుకుని వెళ్లిన సిబ్బంది ఆన్‌లైన్లో ఎక్కించిన గణాంకాలు తప్పుల తడకగా వున్నాయనీ, అందువల్లనే తమకు పరిహారం అందటం లేదని పలువురు బాధితులు వాపోతున్నారు.
 
ఏంటా తప్పులు?
ఉదాహరణకు మోటార్ బైకులు పూర్తిగా నీటిలో మునిగిపోయినవారి సంబంధించిన లెక్కల్లో చాలావరకు తప్పు వివరాలు vipatthunirdharana.apssdc.in/admin/view-survey-completed-info లో కనబడుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ఉదారహణకు తాము బండి నెంబర్ AP 30 QR 7792(నెంబర్ మార్చి చూపించడం జరిగింది) అని వుంటే దాన్ని AP 30 QQR 7792 అంటూ తప్పుగా ఎక్కించారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేసాడు. దాన్ని మార్పించుకునేందుకు సచివాలయం చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు. అలాగే మరో బాధితుడి అనుభవం విచిత్రంగా వుంది.
 
ఆధార్ మ్యాపింగ్ నేనే చేసా, మా అబ్బాయి పేరుపై పరిహారం అంటూ మెలిక?
నష్టపరిహారం అంచనాకు వచ్చిన సిబ్బందితో నేనే దగ్గర వుండి మరీ వివరాలు ఇచ్చాను. నా ఆధార్ నెంబర్‌ను ఫీడ్ చేసి ఓటిపి వచ్చాక ఓకే అని చెప్పి పరిహారం వస్తుందని చెప్పి వెళ్లారు. తీరా చూస్తే... ఆ పరిహారం మా అబ్బాయి పేరు మీద వచ్చినట్లు మెసేజ్ పంపారు. ఆధార్ వివరాలు నాకు సంబంధించినవి, నా పేరు పైన వున్న దెబ్బతిన్న మోటార్ బైకు వివరాలు ఇస్తే... అది మా అబ్బాయి పేరు మీద ఎలా వచ్చిందో అర్థం కాలేదంటూ మరో బాధితుడు చెప్పారు. దీనితో పరిహారం కోసం సచివాలయం వెళితే... ఇది ఇక్కడ అవ్వదు మేస్టారూ.. మీరు కలెక్టర్ ఆఫీసుకి వెళ్లండి అని అంటున్నారు. రేపు నాకు శెలవు లేదు. సెంట్రల్ ఉద్యోగిని, నేను వెళ్లలేను కనుక పరిహారం రాకుండా పోతుందేమోనంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
 
తిరిగి తిరిగి విసుగు వచ్చేసిందండీ, మావల్ల కాదు
చాలామంది బాధితులు అటు సచివాలయం చుట్టూ ఇటు కలెక్టరేట్ చుట్టూ ఈ ఎండల్లో తిరిగి తిరిగి అలసిపోయామని బాధను వెళ్లగక్కారు. ఎలాగూ లక్షల్లో ఆస్తిని నష్టపోయాము. ప్రభుత్వం నుంచి అందే పరిహారం ఆదుకుంటుందని అనుకున్నాము. ఇక పరిహారం కోసం తిరిగే ఓపిక లేదు, అలాగే మేము పనిచేసే కార్యాలయాలు మాకు తిరిగేందుకు శెలవులు కూడా ఇవ్వవు. అందుకే పరిహారం కోసం తిరగడం మానేశాం అంటూ మరికొందరు బాధితులు చెబుతున్నారు.
 
మరి వరద బాధితులందరికీ పూర్తి సాయం అందేనా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న విశ్వాసంతో బాధితులు ఎదురుచూస్తున్నారు.