శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (07:50 IST)

విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం.. జడుసుకున్న జనం

విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పరిశ్రమలో మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గత ఏడాది సంభవించిన ఎల్జీ పాలిమర్స్ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. దీనికోసం రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు చెలరేగడానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు.
 
తాజాగా- అగనంపూడి సమీపంలోని ఏపీఐఐసీ మినీ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడున్న ప్యారామౌంట్‌ సన్‌ లియో ఆగ్రో ఇండస్ట్రీస్‌ కంపెనీలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వంట నూనెలు తయారు చేస్తోన్న సమయంలో మంటలు చెలరేగాయి వంటనూనెల ప్యాకింగ్ ప్లాంట్‌లో తొలుత మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. 
 
అగ్నికీలలు మిగిలిన యూనిట్లకు వ్యాపించకుండా ఉద్యోగులు, సిబ్బంది ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాలేదు. మరింత విస్తరించాయి. వంటనూనెల తయారీ యూనిట్‌కు వ్యాపించాయి. ఫార్మాసిటీ, పెదగంట్యాడల నుంచి మూడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి రప్పించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.