శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (12:40 IST)

కేకే లైనులో పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. కొనసాగుతున్న రైళ్ల రద్దు

goods train derail
విశాఖపట్నం డివిజన్ పరిధిలోని కొత్తవలస- కిరండోల్ (కేకే) లైన్ మార్గంలోని బొడ్డవర యార్డు వద్ద ఆదివారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరు వ్యాగన్లు పక్కకు ఒరిగిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. 
 
ఈ ప్రమాదం కారణంగా సోమవారం ఉదయం విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే రైలును, మంగళవారం ఉదయం కిరండోల్ నుంచి విశాఖ వచ్చే రైలును రద్దు చేసినట్టు సీనియర్ డీసీఎం ఏకేత్రిపాఠి తెలిపారు. అదేవిధంగా ఆగ్నేయ రైల్వే పరిధిలోని ఖరగ్‌పూర్ - భద్రక్ సెక్షన్ ట్రాక్ నిర్వహణ పనులతోపాటు విజయవాడ డివిజనులో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మరికొన్ని రైళ్లను 19వ తేదీ రద్దు చేసినట్టు అధికారులు ఆదివారం తెలిపారు. 20వ తేదీన విశాఖ - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను (17240) రద్దు చేశారు. బొకారో ఎక్స్‌ప్రెస్(13351)ను ఈ నెల 20, 23, 24వ తేదీల్లో రద్దు చేశారు. 
 
అలాగే, హతియా - యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12835) ఈ నెల 20న, టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12889) ఈ నెల 23న హతియా - యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18637) ఈ నెల 24న నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ మీదుగా విజయవాడకు చేరుకుంటాయి. 

వారం రోజుల పాటు ఏకంగా 25 రైళ్లు రద్దు.. 
 
ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు వెళ్లే 25 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ, ఇంజనీరింగ్, సిగ్నలింగ్ వ్యవస్థలో మరమ్మతు పనుల కారణంగా ఈ రైళ్లను ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరుక రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామన్నారు. గుంతకల్ - బోధన్ రైలు సమయంలో మార్పులు చేసినట్టు తెలిపారు. 23 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నేటి నుంచి ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. 
 
వారం రోజు పాటు రద్దు చేసిన రైళ్లలో కాజీపేట - డోర్నకల్, డోర్నకల్ - కాజీపేట, డోర్నకల్ - విజయవాడ, విజయవాడ - డోర్నకల్, భద్రాచలం - విజయవాడ, విజయవాడ - భద్రాచలం, సికింద్రాబాద్ - వికారాబాద్, వికారాబాద్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - వరంగల్, వికారాబాద్ - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - సిర్పూర్ టౌన్, కరీం నగర్ - నిజామాబాద్, నిజామాబాద్ - కరీంనగర్, వాడి - కాచిగూడ, ఫలక్‌నుమా - వాడి, కాజీపేట - సిర్పూర్ టౌన్, బలార్షా - కాజీపేట, భద్రాచలం - బలార్ష, సిర్పూర్ టౌన్ - భద్రాచలం, కాజీపేట - బలార్ష, బలార్ష - కాజీపేట, కాజిగూడ - నిజామాబాద్, నిజామాబాద్ - కాచిగూడ, నిజామాబాద్ - నాందేడ్, నాందేడ్ - నిజామాబాద్, కాచిగూడ - నడికుడి, నడికుడి - కాచిగూడ రైళ్లు ఉన్నాయి. 
 
మరోవైపు ఆదివారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు దౌండ్ - నిజామాబాద్, ముద్ఖేడ్ - నిజామాబాద్, సోమవారం నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్ - పండర్‌పూర్ రైలును, నిజామాబాద్ - ముద్ఖేడ్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. నేటి నుంచి 25వ తేదీ వరకు నంద్యాల - కర్నూలు సిటీ, డోన్ - కర్నూలు సిటీ రైలును, కర్నూలు - గుంతకల్ రైలును, కర్నూలు సిటీ - డోన్ మధ్య రైలును పాక్షిరంగా రద్దు చేశారు. కాచిగూడ - మహబూబ్ నగర్ రైలు, ఉందానగర్ - మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ - కాచిగూడ రైలు, మహబూబ్ నగర్ - ఉందానగర్‌ల మధ్య నడిచే రైలును పాక్షికంగా రద్దు చేశారు.