ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జులై 2020 (21:53 IST)

ఆరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఏమైంది..? చంద్రబాబు

రాజధాని పై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ ఏమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. అమరావతి ఆందోళనలు 200రోజులకు చేరోన సందర్భంగా ఎన్టీఆర్ భవన్ లో దీక్ష చేపట్టిన చంద్రబాబు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
 
‘‘200రోజులుగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇతర రాష్ట్రాలు, దేశవిదేశాల్లో ఉన్న ఆంధ్రులు అందరికీ అభినందనలు. విదేశాల్లో 200 నగరాల్లో సంఘీభావంగా నిరసనలు తెలుపుతున్నఅందరికీ అభినందనలు. 
 
మేము అనుకున్నది సాధిస్తాం, అమరావతిని కాపాడుకుంటామనే పట్టుదలతో పోరాడుతున్న రైతులు, రైతుకూలీలు, మహిళలు, బీసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలు, అన్నివర్గాల ప్రజలకు అభినందనలు. ఈ రోజు అల్లూరి సీతారామ రాజు 124వ జయంతి, ఆయన స్ఫూర్తి మనందరిలో ఉండాలి.

ప్రాణాలు పోయినా ఎక్కడా రాజీపడని వ్యక్తి అల్లూరి సీతారామ రాజు. బ్రిటిష్ పాలననుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు రాజీలేని పోరాటం చేశారు. అమరావతి ఉద్యమానికి ఉద్యమానికి అల్లూరి స్ఫూర్తి. 

అమరావతి కోసం మనోవేదనతో ప్రాణాలు కోల్పోయిన 66మందిలో రైతులు, మహిళలు, రైతుకూలీలు ఉన్నారు, అసువులు బాసిన వాళ్లందరికీ ఈ సందర్భంగా నివాళులు.

అమరావతి పేరులోనే ఉంది మహిమ. దేవేంద్రుడు స్వర్గ లోకానికి రాజైతే దానికి రాజధాని అమరావతి.. అమరావతి అంటే అజరామరం..అమరావతికి చావులేదు, అమరావతిని చంపాలని చూసినా చంపలేరు, వాళ్ల ప్రయత్నాలు కుటిల ప్రయత్నాలే తప్ప ఏమీ సాధించలేరు.

ప్రాచీన నాగరికతకు చిహ్నం అమరావతి, శాతవాహనుల రాజధాని అమరావతి. చారిత్రక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం.
అయోధ్య తర్వాత అలాంటి రామాలయం అమరావతిలో హిందూ మహా సభ తరఫున నిర్మిస్తామని తెలిపిన ఎంవి శాస్త్రికి అభినందనలు.

విభజన తర్వాత మనకు చాలా సమస్యలు వచ్చాయి, రాష్ట్రానికి రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, రాష్ట్రానికి ఆదాయం లేదు. తమిళనాడుకు  చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది.  ఆంధ్రప్రదేశ్ కు కూడా అలాంటి రాజధాని ఉండాలని సంకల్పిచాం. అలాంటి రాజధాని ఏపికి ఉండాలని అనుకోవడం తప్పా..?

13జిల్లాలకు నడిబొడ్డున రాజధానిని ఏర్పాటు చేశాం. 29వేల మంది రైతులు 34వేల ఎకరాల భూములు త్యాగం చేశారు. వారసత్వంగా వచ్చిన భూమితో అనుబంధం వదులుకుని రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగని వినూత్న కార్యక్రమం ల్యాండ్ పూలింగ్ కు నాంది పలికారు. ఏ ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా స్వచ్ఛందంగా ఒకేమాట మీద రైతులు భూములు ఇచ్చారు. రాజధాని వస్తే తాము కూడా బాగుపడతామని కలలుకన్నారు. 

ఆ రోజు ఒక నాలెడ్జ్ ఎకానమికి నాంది పలకాలని ఆలోచించి నేనిచ్చిన విజన్ తోనే హైదరాబాద్ నగరం ఇండియాలోనే బెస్ట్ సిటిగా తయారైంది. సైబరాబాద్, అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశాం. 

మొన్న కరోనా వ్యాక్సిన్ కనుగొన్న భారత్ బయోటెక్ వారిని అభినందిస్తే, ‘‘ఆ రోజు మీరు చూపించిన చొరవతో వచ్చిన బయోటెక్ పార్క్, జెనోమ్ వ్యాలీ స్ఫూర్తితోనే ఇది సాధ్యం అయ్యిందని వాళ్లు చెప్పినప్పుడు’’ గర్వంగా, ఆనందంగా, తృప్తిగా అనిపించింది. 

భావితరాల కోసం చేసిన కార్యక్రమాలే సమాజంలో శాశ్వతంగా మిగిలిపోతాయి. హైదరాబాద్ ను బ్రౌన్ సిటీగా ఆ రోజు అభివృద్ది చేస్తే, అమరావతిని గ్రీన్ సిటిగా నిర్మాణం చేయాలని సంకల్పించాం. మంచి ప్రణాళికలు తయారు చేశాం. తర్వాత అధికారంలోకి వచ్చిన వీళ్లు వాటన్నింటినీ దెబ్బతీశారు. 

‘‘మనది చిన్న రాష్ట్రం, ఈ 13జిల్లాల ప్రజల మధ్య విబేధాలు పెట్టరాదు. అందుకే అమరావతికి మద్దతిస్తున్నాం,  రాజధానికి 30వేల ఎకరాల భూమి కావాలని’’ అసెంబ్లీలో ఆరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఏమైంది..? ఇప్పుడు 3రాజధానులు, 3ముక్కలాట ఆడతారా..? 

మొదటి నుంచి అమరావతిపై అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ అంతా ఒకే కులం అని ఆ రోజు ఆరోపించారు. అమరావతి కోసం పోరాడుతున్న శివారెడ్డిది ఏ కులం, శాస్త్రిది ఏ కులం..? ఈ ప్రాంతం మునిగిపోతుందని అపవాదు వేశారు.చరిత్రలో ఎప్పుడూ ముంపు జరగలేదని, భవిష్యత్తులో ఎలాంటి వరదలకు ఇది మునిగే ప్రాంతం కాదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. 

ఇన్ సైడ్ ట్రేడింగ్ అని ఆరోపించారు, 2 జూన్‌ 2014 నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించిన సెప్టెంబర్‌ 4 వరకు (4 నెలల్లో) 128 ఎకరాలు మాత్రమే క్రయ విక్రయాలు జరిగాయి. వాటిలో కూడా 100 ఎకరాలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేశారు. వారికి టీడీపీతో ఎలాంటి సంబంధం లేదు. మిగిలిన 28 ఎకరాలు ఇతరులు కొనుగోలు చేశారు. ఇక అటువంటప్పుడు ఇన్ సైడ్ ట్రేడింగ్ ఎక్కడ..?

ఈ ప్రాంతంలో పునాదులకు ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రచారం చేశారు. చెన్నై ఐఐటి రిపోర్ట్ ఇచ్చింది ఇతర రాష్ట్రాల నగరాల కన్నా ఇక్కడే తక్కువ ఖర్చని చెప్పింది.

ఒక కుక్కను చంపాలంటే పిచ్చిదనే ముద్రవేసి మనిషికో రాయి వేసి చంపినట్లు అమరావతిని చంపడానికి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేశారంటే ఈ రోజు తలుచుకుంటే బాధేస్తుంది.

అమరావతిలో రూ53వేల కోట్లతో అభివృద్ది పనులు చేపట్టాం. ఇప్పటికే రూ9వేల కోట్లు ఖర్చు చేశాం. అలాంటిది ఇక్కడ ప్రభుత్వం రూ లక్ష కోట్లు పెట్టాలని వీళ్లు చెబుతున్నారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చేపట్టాం. అన్నీ పోను ప్రభుత్వానికి దాదాపు 9వేల ఎకరాల భూమి మిగులుతుంది. 

దానిని కొద్దికొద్దిగా అమ్ముకుంటే ఆ నిధులు చాలు అమరావతి అభివృద్దికి, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు..అవన్నీ పూర్తిచేస్తే అనేక సంస్థలు వచ్చేవి, యువతకు ఉపాధి వచ్చేది, మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చేది.. ప్రపంచం మొత్తం మెచ్చుకునే నగరాన్ని వీళ్లు అనవసరంగా విధ్వంసం చేస్తున్నారు. 

అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాలు అన్నీ పూర్తయ్యాయి. మీరు అక్కడినుంచే పని చేస్తున్నారు. రూపాయి ఖర్చు చేయాల్సిన పనిలేదు.

ఉద్యోగులు, జడ్జిల క్వార్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు 70% పూర్తయ్యాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల నివాసాలు 72% పూర్తయ్యాయి. 

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ 72% పూర్తయ్యాయి, ఎన్జీవో హౌసింగ్ 57%, గ్రూప్ డి ఉద్యోగుల హౌసింగ్ 65%, టైప్ 1 గెజిటెడ్ ఉద్యోగుల నివాసాలు 65 %, టైప్ 2 గెజిటెడ్ ఉద్యోగుల నివాసాలు 65 % పూర్తయ్యాయి.

జ్యుడీషియల్ కాంప్లెక్స్ 65%, హైకోర్టు 65 %, సెక్రటేరియేట్ నిర్మాణ పనులు 65 %, జడ్జిల బంగ్లాలు 28%,  మంత్రుల బంగ్లాలు 27 %, ప్రిన్సిపల్ సెక్రటరీల బంగ్లాలు 26%, సెక్రటరీల బంగ్లాలు 24% పనులు పూర్తయ్యాయి. 

ఇన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, మిగిలినవి కూడా పూర్తి చేస్తే ఈ రోజుకు అమరావతి ఒక రూపానికి వచ్చేది. ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటుకు 139 సంస్థలు ముందుకొచ్చాయి, ఇప్పటికే అమరావతికి హాస్పటళ్లు, యూనివర్సిటీలు  వచ్చాయి. అనేక సంస్థలకు భూములు ఇచ్చాం. అవన్నీ వస్తే యువతకు ఉపాధి వచ్చేది. అవన్నీ ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నాను.

అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలు, రైతుకూలీలను, బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై అనేక కేసులు పెట్టారు. 

పోలీసులను ఉపయోగించి ఆడబిడ్డలను బూటుకాళ్లతో తన్నడం, అనేక రకాలుగా అవమానించారు, దారుణంగా హింసించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లాలన్నా అడుగడుగునా అడ్డు పెట్టారు. అవన్నీ రాసిన మీడియావాళ్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టారు. వీటన్నింటికి సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు  లేరు.
 
ఇంత హింసను, ఇన్ని అవమానాలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడుతున్న అందరికీ అభినందనలు. ఎంతో మంది గుండె ఆగి చనిపోయారు. రాత్రింబవళ్లు కాపలా కాసుకుంటూ ఎప్పుడేం జరుగుతుందో ఆందోళన చెందే పరిస్థితి కల్పించారు. మానవ హక్కులను ఉల్లంఘించారు, ప్రాధమిక హక్కులను ఉల్లంఘిచారు, రాజ్యాంగాన్ని కాలరాశారు.

అయినా ధైర్యంగా ఎదుర్కొన్న మీ స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది.

కౌన్సిల్ లో టిడిపి సహా ఇతర ప్రతిపక్షాలన్నీ అమరావతికి అండగా నిలబడ్డాయి. 2బిల్లులను స్టాండింగ్ కౌన్సిల్ కు పంపాయి. మళ్లీ అదే బిల్లులను కౌన్సిల్ కు తీసుకొస్తే అభ్యంతరం చెప్పారు. 

కర్నూలు అభివృద్ది కావాలి...కానీ ఏం చేశారు, కరోనాకు బలి చేశారు. విశాఖ అభివృద్ది కావాలి...కానీ ఏం చేశారు, భూకబ్జాలు చేశారు. రైతులనుంచి భూములను బలవంతంగా లాగేసుకునే పరిస్థితి తెచ్చారు.
 
అమరావతి స్థల బలం చాలా గొప్పది.. అదేవిధంగా సంకల్ప బలం ఉంది..ప్రజల్లో చిత్తశుద్ది ఉంది. దేశానికే స్ఫూర్తి మీరంతా..9నగరాలతో అమరావతిని బ్రహ్మాండమైన నగరంగా కడతామంటే ముందుకొచ్చి, రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారు. సింగపూర్ ముందుకొచ్చి మాస్టర్ ప్లాన్ ఇచ్చింది, సీడ్ కేపిటల్ అభివృద్దికి ముందుకొచ్చారు.

2లక్షల 50వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. ప్రభుత్వానికి సంపద వచ్చేది, ప్రజలకు ఆదాయం వచ్చేది. వాటన్నింటినీ నాశనం చేశారు.

పార్లమెంటునుంచి పవిత్రమైన మట్టిని, యమునా నది నుంచి పవిత్ర జలాలను ప్రధాని నరేంద్ర మోది అమరావతి శంకుస్థాపనకు తెచ్చారు. నేను తెచ్చింది కేవలం మట్టి నీళ్లు కాదు, పార్లమెంటు మొత్తం మీకు అండగా ఉంటుందనే ఆకాంక్షను తెచ్చాను. ఢిల్లీకంటే ధీటైన నగరం కడతామని ప్రధాని చెప్పి, పూర్తిగా అండగా ఉంటామని చెప్పారు. 

13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి పవిత్ర మట్టిని, పవిత్ర జలాలను తెచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి, పుణ్య జలాలు తెచ్చారు. 
రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ2,500కోట్లు ఇచ్చింది, ఇంకా ఇవ్వడానికి ముందుకొచ్చారు. దానిని ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

‘‘రూ2.70పైసలకు మేము కరెంటు ఇచ్చాం, మీరు రూ9కు అమ్ముతున్నారు, కరోనా కష్టకాలంలో ఏపికి రూ8వేల కోట్లు ఇచ్చాం, దానిని సమర్ధంగా వినియోగించుకోండని’’ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెబితే, ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు ఎవరికి ఇచ్చారు..? వీళ్లకు ప్రతిపక్షం అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, చివరికి కేంద్రం అంటే కూడా లెక్కలేదు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

రాష్ట్రానికి దేశానికి సంపద సృష్టించే ప్రాజెక్టు అమరావతి. ఇది ఏ ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమితమైన ప్రాజెక్టు కాదు. దీనిని కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉంది. ‘ఒక’ రాజధాని అని విభజన చట్టంలో పెట్టారే తప్ప, ‘3రాజధానులని’ పెట్టలేదు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే, ఈ దేశ భవిష్యత్తు ఏమవుతుంది..?
 
 మీరు(కేంద్రం) కూడా డబ్బులు పెట్టారు, ఎంతో ప్రోత్సహించారు. మీకు కూడా బాధ్యత ఉంది, ఈ రాష్ట్రాన్ని, ఈ రాజధానిని కేంద్రమే కాపాడాలని కోరుతున్నాను.

‘‘మన మట్టి-మన నీళ్లు-మన రాజధాని’’ ఒక స్ఫూర్తి కావాలి. ‘‘మై బ్రిక్ -మై అమరావతి’’ కింద రూ54కోట్ల విలువైన ఇటుకలు ఇచ్చారు. మహిళలు చేతి బంగారుగాజులు ఇచ్చారు, ఒంటిమీద బంగారం ఇచ్చారు. ‘‘సేవ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్’’ నినాదం ప్రతిచోటా మార్మోగాలి. 

రాజధాని నిర్మాణం ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, చాలా నష్టం జరిగింది. చాలా విధ్వంసం జరిగింది, చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడీ  కరోనాతో చాలా విధ్వంసం జరిగింది. తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. మరోవైపు సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోది కూడా బోర్డర్ కు వెళ్లారు. ఈ పరిస్థితిలో అందరూ చైతన్యం కావాలి. 

ఇప్పటికైనా వీళ్ల ఆలోచన విధానం మార్చుకోవాలి. ప్రజల మనోభావాలను గౌరవించాలి. ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో వాళ్లందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి ఇక్కడే ఉంటుంది. రాజధాని ఇక్కడే ఉంటుందని ఈ ప్రభుత్వం ప్రకటించాలి. 

మీ ఉద్యమ స్ఫూర్తి ఇదే మాదిరిగా కొనసాగించాలి. అమరావతిని సాధించేవరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ దీక్షలను విరమించరాదు, దీనిని ముందుకు తీసుకెళ్లాలని’’ అని చంద్రబాబు పిలుపిచ్చారు.