శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (09:19 IST)

వ్యభిచార గృహానికి డబ్బులు చెల్లించి వెళ్లిన విటుడు ఓ కస్టమర్ : ఏపీ హైకోర్టు

prostitute
వ్యభిచార గృహానికి డబ్బులు చెల్లించి వెళ్లిన విటుడు ఓ కస్టమర్‌తో సమానమని, అతన్ని ఎలా విచారిస్తారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. వ్యభిచార గృహానికి డబ్బులు చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని విచారించే హక్కు లేదని పిటిషనర్ హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్ళింది. ఈ వ్యాఖ్యలతో ఏకీభవించిన కోర్టు కస్టమర్‌ను విచారించడానికి వీల్లేదని పేర్కొంది. 
 
గత 2020లో గుంటూరుకు చెందిన వ్యక్తి ఓ వ్యభిచార గృహానికి వెళ్లి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఆయనపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేసింది. ఈ కేసు గుంటూరులోని మొదటి తరగతి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు (మొబైల్ కోర్టు)లో అతడిపై కేసు పెండింగులో ఉంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెడింగులో ఉన్న కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. 
 
ఆయన తరపున హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ 2020 అక్టోబరు పదో తేదీన తన క్లయింటుపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. దర్యాప్తు అనంతరం చార్జిషీట్ కూడా దాఖలు చేశారని చెప్పారు. వ్యభిచార గృహంపై దాడి చేసినపుడు తన క్లయింట్ కస్టమర్‌గా ఉన్నాడని తెలిపారు. 
 
నిజానికి వ్యభిచార గృహం నిర్వహించే వారిపై, ఆ ఇంటిని వ్యభిచారానికి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు డబ్బులు చెల్లించి కస్టమర్‌గా వెళ్ళిన విటుడైన తన క్లయింట్‌ను ఎలా విచారిస్తారని తెలిపారు. చట్టంలోని నిబంధనలు కూడా కస్టమర్‌ను విచారించకూడదనే చెబుతోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
గతంలో వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్‌పై నమోదైన కేసును కూడా ఇదే కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత న్యాయమూర్తి డి.రమేష్ దిగువ కోర్టులో పిటిషనర్‌పై ఉన్న కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.