శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (17:30 IST)

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా: ఏ.పి. ప్రెస్ అకాడమి చైర్మన్‌

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి అధ్యక్షునిగా శ్రీనాధ్ దేవిరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజ‌య‌వాడ‌లోని స్థానిక మొగల్రాజపురంలో ఉన్న ప్రెస్ అకాడమి కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అంజాద్ భాషా, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనరు టి.విజయకుమార్ రెడ్డి, పలువురు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు, పలువురు సమాచార శాఖ అధికారులు శ్రీనాధ్ దేవిరెడ్డికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీనాధ్ దేవిరెడ్డి మాట్లాడుతూ..  జర్నలిస్టుగా నాలుగ ద‌శాబ్ధాలు పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేశానని దీనిని అలాగే ఎప్ప‌టికీ కొనసాగిస్తానన్నారు. 40 ఏళ్లుగా జర్నలిస్టుగా ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా సేవ చేసే అవకాశం రాలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి ఇప్పుడు అవకాశం కల్పించారని, త‌న‌పై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం గురించి తపన ఉన్న వ్యక్తి అని పాదయాత్రలో చూసానని, అలాగే పరిపాలనలో కూడా ప్రజాసంక్షేమం అమలు చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు అంటే ఆయనకు అపారమైన గౌరవం ఉందని ఆయనలోనే ఒక జర్నలిస్ట్ ఉన్నాడని, జర్నలిస్టులకు ఎంతో చేయాలనే తపన ఆయనలో ఉందన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. సోషల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతున్నందున సమాజంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, నిజానిజాలు బయటకు రాకుండా వార్తలు వేగంగా వ్యాప్తి చెందడం వలన ప్రజల్లో అపోహలు పెరిగిపోతున్నాయన్నారు.

ఫేక్ న్యూస్ ప్రమాదకరంగా మారిందని దీనిని ఎ దుర్కోవడానికి ఆలోచన చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తమ విలువలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంత విలేఖరులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుని గ్రామీణ విలేఖరుల అభివృద్ధి సంక్షేమానికి గట్టిగా కృషి చేస్తానన్నారు.

ప్రజలకు ఉపయోగపడేవిధంగా గ్రామీణ విలేఖరులలో చైతన్యం తీసుకువచ్చే విధంగా పనిచేస్తానన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ఈశ్రీనాధ్ నిబద్దత గుర్తించే పదవి: ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా
ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ శ్రీనాధ్ జర్నలిజంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తి అని ఆయన పదవి కాలంలో ప్రెస్ అకాడమి కార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు.

శ్రీనాధ్ నిబద్ధతతో పత్రికా రంగానికి ఎనలేని సేవచేసారని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి శ్రీనాధ్ సేవలను గుర్తించి ప్రెస్ అకాడమి ఛైర్మన్‌గా నియమించడం సంతోషకరంగా ఉందని ఆయనకు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. 

ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఐదారుగురు సీనియర్ జర్నలిస్టులకు తమ ప్రభుత్వంలో పలు పదవులు ఇచ్చారన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పదవులు ఇచ్చిన ప్రభుత్వం ఇంతకు ముందు ఏదీ లేదన్నారు.

ఇది జర్నలిస్టులు అందరికీ సంతోషకరమని పేర్కొన్నారు. ప్రెస్ అకాడమి ఛైర్మన్‌గా మరో సీనియర్ జర్నలిస్టు శ్రీనాధ్ దేవి రెడ్డిని నియమించడం పట్ల ముఖ్యమంత్రికి జర్నలిస్టులు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. 1996 లో ప్రారంభమైన ప్రెస్ అకాడమి గ్రామీణ ప్రాంతంలోని జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేదన్నారు.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రెస్ అకాడమి నామమాత్రంగా మారిందన్నారు. ప్రస్తుత ఛైర్మన్ గ్రామీణ ప్రాంతంలో పనిచేయడం వలన గ్రామీణ విలేఖరుల అవసరములు ఆయనకు తెలుసునని అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా గ్రామీణ జర్నలిస్టుల అవసరాలను గుర్తించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

నిజంగా యాజమాన్యాలు శిక్షణ ఇచ్చే బాధ్యతలు తీసుకోవాలని అయితే యాజమాన్యాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వం సామాజిక బాధ్యతగా గుర్తించి ఏపి ప్రభుత్వం ప్రెస్ అకాడమి ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నదన్నారు.

ప్రెస్ అకాడమిలో శిక్షణా కార్యక్రమాలు, ప్రచురణలు, తదితర కార్యక్రమాలు ఉంటాయికనుక ప్రెస్ అకాడమి స్థలం, భవనాలు నిర్మించుకునేందుకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ప్రెస్ అకాడమి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనాధ్‌ను అభినందించారు.

25 సంవత్సరాలు శ్రీనాధ్ తాను ఒకే సంస్థలో పనిచేసామని ఆయన జిల్లా వదిలి హైదరాబాద్, ఢిల్లీలలో పనిచేసి ఉంటే మంచి పేరు సాధించేవారన్నారు. ఆయన జిల్లా వదిలి రాకపోవడం వలన కడప జిల్లాకే పరిమితం అయ్యారని అయినప్పటికీ ప్రభుత్వం ఆయనను గుర్తించి ముఖ్యమంత్రి ఆయనకు పదవిని ఇచ్చారన్నారు. 

సమాచార శాఖ కమిషనరు టి. విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజంలో నైపుణ్యం, మెళుకువలు తెలిసిన వ్యక్తి శ్రీనాధ్ దేవిరెడ్డి అని అన్నారు. ఆయనకు అనేక పత్రికలలో పనిచేసిన విశేషమైన అనుభవం ఉందన్నారు. ప్రెస్ అకాడమికి సరిగ్గా సరిపోయే వ్యక్తిని ముఖ్యమంత్రి ఎంపిక చేసారని ఆయన కొనియాడారు.

ఆయనలోని నైతికత విలువలను సియం గుర్తించి ప్రెస్ అకాడమి చైర్మన్ పదవి ఇచ్చారని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కుని నిలబడి జర్నలిస్టుల సంక్షేమానికి శ్రీనాధ్ పాటుపడతారని, ఆయన పదవికాలంలో గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు ద్వారా మరింత ముందుకు తీసుకువెళతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అడిషినల్ డైరెక్టరు డి.శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్‌కుమార్, టి.కస్తూరి, వెంకటేష్, విశ్రాంత జేడి కె.రామపుల్లారెడ్డి, ప్రెస్ అకాడమి సెక్రటరి యం.బాలగంగాధర్ తిలక్, పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు, శ్రీనాధ్ దేవిరెడ్డి సతీమణి శ్రీమతి సుధ, ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు పాల్గొని అభినందనలు తెలిపారు.