సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (20:44 IST)

మీ సంక్షేమం నా బాధ్యత ... రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు

ఇండ్ల నిర్మాణాలను, కేటాయింపులను పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.

బుధవారం వెలగపూడి సచివాలయంలో వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకంపై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, కార్పొరేషన్ హౌసింగ్ కి చెందిన పథక సంచాలకులు, కార్యనిర్వాహక ఇంజినీర్లుతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ రాష్టంలోని ఇతర శాఖలకు హౌసింగ్ శాఖకు తేడా ఉందని, ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న శాఖ తమదన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలలో గృహ నిర్మాణం కీలకమైనదని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు గృహ నిర్మాణాల స్థితిగతులను పిడిలు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పర్యవేక్షించాలన్నారు. గతంలో జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో ఎంపికలు జరిగిన విషయం తెలిసిందేనని, అటువంటి వాటికి తావు ఇవ్వకుండా పారదర్శకంగా, గృహాలు మంజురు ఉండాలన్నారు.

పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలు తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో 25 లక్షల మందికి స్వంత ఇంటి కల నెరవేరుస్తానని మేనిఫెస్టో లో హామీ ఇచ్చారన్నారు. అర్హత గల లబ్ధిదారులకి ఇల్లు, ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీని చెప్పినందున అధికారులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు.

రాష్ట్రంలో గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు చెందిన రూ.840 కోట్లు పెండింగులో ఉన్నాయని , ఆర్థిక శాఖ మంత్రితోనూ, ముఖ్య కార్యదర్శి తోనూ మాట్లాడానని త్వరలోనే రూ.500 కోట్లు విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించారన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఆ దిశలో పనిచేయాల్సి ఉందన్నారు. సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించేందుకు తనవంతు కృషి చేస్తుంటానన్నారు. టిడ్ కో ప్రతినిధులు తనతో సంప్రదిస్తున్నారన్నారు.

ఇండ్ల నిర్మాణల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక యాప్ అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనుసంధానం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇండ్ల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు.

రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లో 124 నియోజక వర్గాలు భారత ప్రభుత్వ పట్టణ హౌసింగ్ పరిధిలో ఉన్నాయని, రాష్ట్రంలో చేపట్టే ఇండ్ల నిర్మాణాల నిధుల కోసం కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకుని రావడం జరుగుతుందని మంత్రి శ్రీ రంగధరాజు పేర్కొన్నారు. 

మీ సంక్షేమం నా బాధ్యతని, సమస్యలు ఉంటాయని, క్షేత్ర స్థాయిలో విధుల్ని నిబద్దతో చేపట్టాలని కోరుతున్నానని తెలిపారు. కుటుంబ బాధ్యతలని ఏవిధంగా నిర్వర్తిస్తారో అదేవిధంగా విధుల్లో కూడా చూపాలని స్పష్టం చేసారు. ఇటీవల బదిలీల సందర్భంలో అధికారులు, ఇంజినీరులు సహకరించారన్నారు.

ముఖ్యమంత్రితో మాట్లాడి మంధ్యంతర భృతి కోసం కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఎస్సీ ఎస్టీ లబ్దిదారులకి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న గృహ నిర్మాణం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు కలసి ముందుకు వెళదామని మంత్రి తెలిపారు.

భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. శాసన సభ్యులను కూడా భాగస్వామ్యం చేసుకుని వెళ్లాలని మంత్రి సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరామ్, ఎండి కాంతిలాల్ దండే రాష్ట్రంలో గృహ నిర్మాణం ప్రగతి వివరాలను సమీక్షలో మంత్రికి వివరించారు. సమావేశంలో 13 జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్ లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, హెడ్ ఆఫీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.