శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్య‌త‌

కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని జాతీయ కార్మిక సంక్షేమ సంఘం ఛైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు.

సూర్యారావుపేటలోని ఓ హోట‌ల్‌లో మంగళవారం మీడియాతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ జాతీయ కార్మిక సంక్షేమ సంఘం ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటివరకు కార్మిక శాఖ అధికారులతో జరిగిన రెండు సమావేశాల్లో అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించానన్నారు.

దీనివల్ల మూడున్నర కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. మీడియాలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ పలు పథకాలు అమలుచేస్తున్నా గత ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోలేదన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా జర్నలిస్టుల సంక్షేమానికి రూ.58 కోట్లు ఖర్చుచేసిందన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు, జర్నలిస్టుల పిల్లలకు ఏడాదికి రూ. 20 వేల ఉపకారవేతనం, రూ.15 లక్షల వరకు వైద్య చికిత్స ఖర్చులు వంటి పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు.

మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఈ నెల 30న గుంటూరులో సభను నిర్వహిస్తున్నామన్నారు. దానికి గుజరాత్‌లోని సేవాగ్రామ్ నుంచి ప్రతినిధి హాజరవుతున్నారని చెప్పారు. స్టాన్‌ఫోర్డ్ వర్శిటీలో జరిగిన గాంధీజీ జయంతి కార్యక్రమానికి భారతదేశ ప్రతినిధిగా హాజరై ప్రసంగించినట్లు తెలిపారు.

త్వరలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ విజయవాడలో సమావేశం నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, అధికార ప్రతినిధులు కోసూరి వెంకట్, చాగర్లమూడి గాయత్రి, మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.