మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (15:30 IST)

పంచాయతీ ఎన్నికలు సజావుజా సాగాలే చర్యలు తీసుకోవాలి : యనమల

ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలి ద‌శ‌ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుద‌లైన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు స‌హక‌రించ‌క‌పోతుండ‌టం విచారకరమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా ఇటువంటి తీరు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం దేశ చరిత్రలోనే ఎక్క‌డా లేదని ఆయ‌న విమ‌ర్శించారు.
 
స్థానిక పాలన అందించటంలో రాష్ట్ర‌ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ప్ర‌భుత్వ మాట‌లు వింటూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడటం స‌రికాద‌ని ఉద్యోగులకు హిత‌వు ప‌లికారు. 
 
ఎన్నిక‌ల విధుల్లో అధికార యంత్రాంగాన్ని పాల్గొనకుండా చేయడం ద్వారా ముఖ్య‌మంత్రి జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్న జ‌గ‌న్ తగిన మూల్యం చెల్లించుకుంటార‌ని తెలిపారు.
 
పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా గవర్నర్‌ తన అధికారాల‌ను వినియోగించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగానికి లోబడి త‌మ విధులు నిర్వ‌ర్తిస్తామ‌ని ప్రమాణం చేసి పనిలో చేరిన‌ ఉద్యోగులు, అధికారులు ఆ విష‌యాన్ని గుర్తు చేసుకోవాలని యనమల హితవు పలికారు.