సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (09:15 IST)

పీఛేమూడ్ : మారిన యార్లగడ్డ స్వరం.. పేరు మార్పుపై నో కామెంట్స్

Yarlagadda
ఏపీ రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నాలుక మడతపెట్టేశాడు. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఇకపై మాట్లాడబోనని స్పష్టం చేశారు. పైగా మంచో చెడో పేరు మార్పు జరిగిపోయింది. ఇక నా దృష్టంతా సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకుని తెలుగు భాషాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. 
 
ఆయన ఆదివారం ఉదయ వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన కొండపై మీడియాతో మాట్లాడుతూ, మంచో చెడో ఎన్టీఆర్ విషయంలో ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నాకు ఎన్టీఆర్ అంటే అమితమైన భక్తి, తెలుగు వ్యక్తిత్వానికి, తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనమైన ఎన్టీఆర్ అంటే నాకు అత్యంత గౌరవరం. ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్పుపై మాట్లాడాను. ఇకపై మాట్లాడనుకోవడం లేదు అని చెప్పారు. 
 
పైగా, ఇకపై రాజకీయాలు మాట్లాడనని శ్రీవారి సన్నిధిలో సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. బహిరంగంగా రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించనన్నారు. రాజకీయ నాయకులు చెడ్డవారని, రాజకీయాలు చెడ్డవని తాను చెప్పడం లేదని.. తాను రాజకీయ నాయకుడు కాకపోయినా అనేక రాజకీయాలు చేశానని.. ఇకపై వాటికి స్వస్తి పలుకుతానని చెప్పారు.
 
అదేసమయంలో వాణిజ్య, పారిశ్రామిక సంఘాలను, ఉద్యోగ సంఘాలను, అధ్యాపక, అధ్యాపకేతర, లయన్స్‌, రోటరీ క్లబ్‌ల వారిని, రాజకీయ పార్టీల్లో బాధ్యత కలిగిన పదవుల్లో లేనివారిని వ్యక్తిగతంగా కలిసి.. వారందరినీ కలుపుకొని.. రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగును అమలు చేయించడమే తన జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యమని యార్లగడ్డ తెలిపారు. 
 
కాగా, హెల్త్ యూనవర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే తమ పదవికి రాజీనామా చేస్తున్నట్టు యార్లగడ్డ ప్రకటించారు. అపుడే అనేకమంది ఆయన నిజాయితీపై సందేహం వ్యక్తం చేశారు. 
 
ఈ రాజీనామా ఉత్తుత్తిదేనంటూ కామెంట్స్ చేశారు. ఇపుడు ఆయన రాజీనామా ప్రకటన కూడా ఉత్తుత్తిదేనని తేలిపోయింది. ఆయనకు పదవులే ముఖ్యమని, ఇందుకోసం కల్లిబొల్లి మాటలు చెప్పేందుకు, మాట తప్పేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరనే ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి.