రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు.. వైకాపా నేతకు మూడేళ్ల జైలు
ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఉప ఎన్నికల ఫలితాల సమయంలో వైకాపా కార్యాలయం వద్ద లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ హెచ్.ఏ.రహమాన్‌కు కోర్టు మూడేళ్ల ఒక నెలపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2012 జూన్ 15న జూబ్లీహిల్స్‌లో రోడ్డు నంబర్ 45లో వైకాపా కార్యాలయం వద్ద ఉపఎన్నికల ఫలితాల సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
18 అసెంబ్లీ సీట్లలో 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని పార్టీ ముందంజలో ఉండటంతో నాయకులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో రహమాన్ తన రివాల్వర్‌తో గాలిలోకి 5 రౌండ్లు కాల్చాడు. అప్పుడు విధులు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ ఎస్సై కే. సైదులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్‌ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కి తరలించారు.
ఛార్జిషీటు దాఖలు చేశారు. నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు మంగళవారం తీర్పునిచ్చారు. రహమాన్‌కు మూడేళ్ల ఒక నెల జైలు శిక్ష, 5 వేల అపరాధ రుసుము విధించి శిక్ష అమలు చేసారు.